టి20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. బంగ్లా విసిరిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 42 బంతుల్లో 8 ఫోర్లతో 64 పరుగులు చేసి 19 ఓవర్లో ఔట్ కావడంతో బంగ్లా పైచేయి సాధించింది.
అయితే చివరి బంతికి జింబాబ్వే ఆటగాడు ముజరబాని క్రీజులో ఉన్నాడు, మోసాద్దేక్ హుస్సేన్ వేసిన బంతిని వికెట్ కీపర్ నురుల్ హాసన్ స్టంప్ ఔట్ చేయడంతో నాలుగు పరుగులతో బంగ్లా గెలిచినట్లు సంబరాలు చేసుకుంటూ ఆటగాళ్ళు మైదానం వీడారు. కానీ రివ్యూలో బంతిని వికెట్ల ముందునుంచి అందుకుని స్టంప్ చేసినట్లు తేలడంతో మ్యాచ్ రిఫరీ దాన్ని నోబాల్ గా ప్రకటించారు. దీనితో బంగ్లా ఆటగాళ్ళు, జింబాబ్వే బ్యాట్స్ మెన్ మరోసారి మైదానంలోకి వచ్చి మరో బంతి ఆడాల్సి వచ్చింది. ఈ బంతికి మళ్ళీ ముజరబానీ స్టంప్ ఔట్ అయ్యాడు. నోబాల్ తో వచ్చిన అదనపు పరుగుతో చివరకు బంగ్లా మూడు పరుగుల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.
బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో ఓపెనర్ శాంటో 55 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్ తో 71; కెప్టెన్ షకీబ్-23; అఫిఫ్ హుస్సేన్-29 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది.
జింబాబ్వే బౌలర్లలో నగరవ, ముజరబని చెరో రెండు; రాజా, సియాన్ విలియమ్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత జింబాబ్వే లో సేయన్ విలియమ్స్-64; రియాన్ బర్ల్-27 పరుగులు చేశారు. ఓపెనర్లతో పాటు వన్ డౌన్ లో వచ్చిన ముగ్గురూ సింగల్ డిజిట్ కే వెనుదిరిగారు.
బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మూడు; మోసాద్దెక్ హుస్సేన్, ముజాఫర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మూడు వికెట్లు పడగొట్టిన టస్కిన్ అహ్మద్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.