Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబట్టలు- నగలు- ఆసుపత్రులు

బట్టలు- నగలు- ఆసుపత్రులు

Road No 10 Banjara Hills: పట్టు బట్టలు- నగలు- ఆసుపత్రులు. పోటీ పరీక్షల ఆబ్జెక్టివ్ ఒక మార్కు ప్రశ్నల్లో ఇలాంటివి ఉంటాయి. ఆడ్ గా ఉన్న ఒకదాన్ని గుర్తించాలి. పట్టు బట్టలు, నగలు ఒక ఫ్యామిలీ పదాలు. ఈ వరుసలో ఆసుపత్రి ఆడ్. అతకదు. కానీ హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ టెన్లో పట్టుబట్టలు- నగలు-ఆసుపత్రులు ఆడ్ గా కాకుండా అతికినట్లు పక్కపక్కనే ఉంటాయి.

Road No 10

పేరుకే ఇవి పట్టుబట్టల షాపులు. నిజానికివి మామూలు కాటన్ బట్టలు కావు. నోరుతిరగని పేర్లతో ఏవేవో ప్రత్యేక వస్త్రాల షాపులు. షాపుల పేర్లు ప్రస్తావించడం సభా మర్యాద కాదు. దేశవ్యాప్తంగా పేరుపొందిన డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించి ఒక్కొక్క నూలుపోగు వేలల్లో, లక్షల్లో అమ్మే బట్టలు అనుకుంటే చాలు. సంపన్నులు, అతి సంపన్నులకు మాత్రమే అనుకున్నా మర్యాదగా ఉంటుంది. వారి సంపద, వారి ఖర్చు, వారు ముచ్చటపడి కొనుక్కుని వేసుకునే బట్టలు. ఇందులో మనకెలాంటి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. అయితే ఒక నూలుపోగు కొనడానికి బస్సంత పెద్ద కార్లో ఒకరు వస్తారు.

ఏ షాపు ముందూ పొరపాటున కూడా పార్కింగ్ ప్లేస్ ఉండదు. మూడు నూలుపోగులకు ముగ్గురమ్మలు ఒక షాపును పావనం చేశారు అనుకుందాం. మూడు బస్సంత కార్లు రోడ్డుమీద దర్జాగా ఆగి ఉంటాయి. బోడి మధ్యతరగతి మారుతీ కారయితే పోలీసులు ఈడ్చి అవతల పారేయచ్చు. తలవాచిపోయేంత ఫైన్లు వేయవచ్చు. చూస్తూ చూస్తూ అంతటి ఆడి ఎయిట్ ఎల్ , బి ఎం డబుల్యు సెవెన్ సిరీస్, పోర్షేలను ఈడ్చి అవతలపారేయడానికి పోలీసులకు మనసొప్పదు. ఫైన్లు వేయడం భావ్యం కాదు. ఆ రోడ్డుకు ఆ షాపులు అందం, ఆ షాపులకు ఈ కార్లు మరింత అందం. మహా అయితే ఓ గంట ట్రాఫిక్ జామవుతుంది. అయ్యే జామ్ ఎక్కడయినా అవుతుంది అని వేదాంతధోరణిలో అనుకుంటే బంజారా పదికి, రోడ్డుమీద పదిమందికీ మంచిది.

Road No 10

కాబోయే పెళ్లికూతురు, పెళ్ళికొడుకు వారికుటుంబాలు వచ్చినపుడు లోక కళ్యాణం కోసం బంజారా పది రోడ్డు ఎంతసేపయినా రోడ్డుమీదే పడిగాపులు పడి ఉంటుంది. అత్యాధునిక జీన్సుల్లో పెళ్ళికొడుకు- పెళ్లికూతురు, అతి సంప్రదాయ దుస్తుల్లో వారి తల్లిదండ్రులు పట్టుబట్టల షాపుల్లోకి వెళుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందులో ఒకాయనకు చంకలో బ్యాగ్ ఉంటుంది. ఆయన్ను పెళ్లికూతురి తండ్రిగా ఎవరయినా సులభంగా గుర్తించవచ్చు. షాపులోకి వెళ్లేప్పుడు అందరిలో ఉత్సాహం ఉంటుంది. బయటికి వచ్చేప్పుడు కొందరిలో ఏదో లోపిస్తుంది. ఇలాంటి పెళ్లి బృందాల కార్లలో ముసలి ముతక అందరూ సర్దుకుని సర్దుకుని కూర్చునేవరకు ఆ కార్లు రోడ్డుమీద ఆగడం, ట్రాఫిక్ జామ్ కావడం కూడా లోకకళ్యాణంలో భాగంగానే పరిగణించాలి. వెయ్యి అబద్ధాలాడయినా ఒక పెళ్లి చేయమని హితోపదేశం. ఒక పెళ్లికోసం వెయ్యికార్లు అరగంట రోడ్డుమీద ఆగిపోవడం సంఘజీవనంలో గర్వించదగ్గవిషయమేకానీ, ఏ మాత్రం తప్పుకాదు.

ఒక శుభముహూర్తాన ఈ సంపన్న షాపుల్లో డిస్కౌంట్ సేల్ పెడతారు. అప్పుడు నగర సంపన్నులందరూ మూకుమ్మడిగా ఒక్కొక్కరు రెండ్రెండు కార్లు వేసుకుని వస్తారు. సహజంగా ట్రాఫిక్ జామవుతుంది. ఇది సంపన్నులపట్ల సామాన్యులు చూపించే గౌరవంగా భావించి రోడ్డుమీద దిక్కులు చూస్తూ గడపాలి తప్ప...అసహనం, నిరసన వ్యక్తం చేసి ప్రయోజనం ఉండదు.

ఇంతటి పట్టు బట్టలు, ప్రత్యేక సందర్భాల బట్టలు, నగల షాపుల మధ్య లెక్కలేనన్ని ఆసుపత్రులు ఎలా వచ్చాయో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి పరామర్శలకు వచ్చేవారు, వారి కార్లు లెక్కలేనన్ని. అతి ఖరీదయిన బట్టలు, నగలకోసం వచ్చినవారితో ట్రాఫిక్ జామ్ అయినప్పుడే మౌనంగా భరిస్తున్న బంజారా పది రోడ్డు- ప్రాణం మీదికి వచ్చి, రోగంతో వచ్చే రోగులను ఎట్టి పరిస్థితుల్లో ఏమీ అనదు, అనలేదు. అనకూడదు కూడా. మొత్తం మీద లోక కళ్యాణం కోసం, ప్రపంచ ఆరోగ్యం కోసం బంజారా పది రోడ్డు భరిస్తున్న కష్టం కష్టం కాదు. ఇలాంటి సామూహిక సంయమనం గుర్తింపులేకుండా వృథాగా పోవడం నాగరిక సమాజానికి మంచిది కాదు.

Road No 10

నాలో సహనం పెరగడానికి ఈ రోడ్డు మీదే నా ఆఫీసు ఉండడం ఒక పరోక్ష కారణం. నాలో వేదాంతధోరణి పాదుకుని, చిగురించి, శాఖోపశాఖలుగా విస్తరించడానికి ఈ రోడ్డు మీది తళతళలాడే ముగ్ధ రీతుల అంగసూత్రం పట్టుబట్టలు, నగలు; వాటి మధ్య ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని విప్పి చెప్పే అయిదు నక్షత్రాల, ఇంద్రధనసు ఆసుపత్రులు ప్రత్యక్ష కారణం. జ్ఞానం ఎవరికీ ఊరికే రాదంటారు కానీ…అది నిజం కాదు. బంజారా రోడ్డు నంబరు పది మీద పది నిముషాలుంటే ఎవరికయినా జ్ఞాన వైరాగ్యాలు వద్దన్నా వస్తాయి.

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి: 

దేవుడికన్నా దెబ్బే గురువు

RELATED ARTICLES

Most Popular

న్యూస్