డిస్కోకింగ్ బప్పీలహరి ఇప్పటికీ తన ప్రత్యేక డిస్కో వినసొంపు భాణీలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. చదలవాడ తిరుపతిరావు ఆయన సోదరుడు చదలవాడ శ్రీనివాసరావు తాజాగా నిర్మించబోయే ఓ భారీ యాక్షన్ చిత్రానికి బప్పీలహరి సంగీతం సమకూర్చబోతున్నట్లు ఆ చిత్ర దర్శకుడు జి. రవికుమార్ మీడియాకు తెలియజేశారు. చదలవాడ బ్రదర్స్ నిర్మించిన ‘రోజ్ గార్డెన్’ ద్వారా హీరోగా పరిచయమవుతున్న నితిన్ నాష్ ఈ చిత్రంలో కూడా హీరో గా నటించనున్నారు.
“రోజ్ గార్డెన్” సంగీతంతో కూడిన ప్రేమ కథాచిత్రం అయినప్పటికీ ఆ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టిన నితిన్ నాష్ యాక్షన్ హీరోగా రాణించగలడనే పూర్తి నమ్మకంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు చదలవాడ తిరుపతిరావు వెల్లడించారు. కాశ్మీర్ లో భారీ ఎత్తున హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ‘రోజ్ గార్డెన్’ ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. డాల్బీ మిక్సింగ్, డి ఐ పనుల దశలో ఉన్న ఈ చిత్రాన్ని నిర్మాతలు అతి త్వరలో ప్రపంచం అంతటా విడుదల చేయబోతున్నారు.