Thursday, March 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపిండం పెట్టక ముందే...

పిండం పెట్టక ముందే…

Caste- Character:

‘ఏంటి బాస్? బెల్టా?’

‘……….’

‘చెప్పు ఫర్లేదు. ఇక్కడిదేం కొత్తకాదు. అవునా?’

‘అవునండీ!’

‘మీ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ హెడ్స్ ముగ్గురూ మీవాళ్లే! ఇక నీకు ఢోకాలేదు, ఫో!’

మెడికల్ కాలేజీలో చేరిన వెంటనే ర్యాగింగ్ విపరీతంగా చేయబడ్డ అభాగ్యుల్లో నేను టాప్‌టెన్‌లో ఉంటాను. అందులో భాగమే ఈ సంభాషణ.

ఇంకొకడైతే మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

‘ఫిజియాలజీ ప్రొఫెసర్ టేకుమళ్ళ కామేశ్వర్రావు నీ భుజం మీద చెయ్యేసి ప్రేమగా పలకరిస్తాడు. ఆ వంకతో నీ జబ్బ తడుముతూ థ్రెడ్ ఉందో లేదో తెలుసుకుంటాడు. ఒకవేళ ఉందే అనుకో, నువ్వతని దృష్టిలో పడ్డావన్నమాటే! ఇక నీ పాస్ ఖాయం!’

K Viswanath

ఈ విషయం విని చాలా ఆశ్చర్యచకితుణ్ణయాను. వెధవది పద్దెనిమిదేళ్ళ పడుచువాణ్ణి. ఏ కులాపాపం తెలీకుండా కాపు, గవర కుర్రాళ్ళతో కలిసి గవర్నమెంట్ బళ్ళలో చదువుకున్న అమాయకుణ్ణి.

ఎంతసేపూ మేష్టర్లు చెప్పేవి చెవినెక్కించుకోవడమే తప్ప కులాల గురించి కూలంకషంగా తర్కించుకునే జనరేషన్ కాదది.

ఆమాటకొస్తే ఇంతకుముందు పేరాలో కాపు, గవర అంటూ రాసిన విషయాలు కూడా ఆ బడిలోంచి బయటపడిన తరవాతే తెలిశాయి.

కాండ్రేగుల రామకృష్ణంటే గవర్ల కుర్రాడనీ, సింగంశెట్టి అప్పారావు కాపులబ్బాయనీ, దాట్ల భూపతిరాజు గాడు క్షత్రియుడనీ తెలియడానికి ఈ మెడికల్ కాలేజీ సీనియర్లు చాలా సాయంచేశారు. హౌ స్వీట్ ఆఫ్ దెమ్?

కొన్నాళ్ళిలాగే కాలేజీ ఎలక్షన్లలో ఎస్సీ, బీసీ & బ్రాహ్మిణ్ కుర్రాళ్ళంతా ఓ గ్రూపూ, మిగతా ఓసీ కుర్రాళ్ళంతా ఓ గ్రూపూ కింద విడిపోయి పోటీ చేశారు. జనరల్ సెక్రటరీగా బ్రాహ్మలబ్బాయి ఓడిపోయాడు. కాపుల కుర్రాడు గెలిచాడు. ఇంతాజేసి ఇద్దరూ మా క్లాసే!

ఈ కాపులబ్బాయే నన్ను అస్తమానూ వాడి యెజ్డీ మీద తిప్పుతూ ఉండేవాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం. మాయిద్దరికీ ఒక్క నెంబరే తేడా. క్లాసులో వాడిది నెంబర్ వన్, నాది మూడు.

K Viswanath

ఈ బ్రాహ్మలబ్బాయీ అనుంగు మిత్రుడే! ఆమాటకొస్తే అందరూ అంతే! ఇప్పుడు కలుసుకున్నా ఆత్మీయంగా గంటలు గంటలు కబుర్లాడుకుంటాం. అవన్నీ కాలేజీ కబుర్లే!

అయితే ఆ భుజం తడుముతూ జంధ్యాన్ని కనిపెట్టే విషయం నాకు ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పానా? ఆనక తెలిసింది…

అదెంత పాచిపట్టిన పాత జోకో అని! ఈ సమాజంలో ఇనేవాడుంటే ప్రతీవాడూ ఇమంది రామారావేనని కూడా తెలిసింది.

కొన్నాళ్ళు ఆంధ్రా యూనివర్సిటీ కేంపస్‌లో తిరిగాం పీహెచ్‌డీ మిత్రులతో కలిసి. వాళ్ళు కూడా ఇదే జోక్ చెప్పారు. జియాలజీ ప్రొఫెసర్ భుజం తడుముతాడని.

ఆ తరవాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగాకి వచ్చిన మగపిల్లలందరి భుజాలు తడుముతాడని, ఆ ప్రకారంగా కేబుల్ ఉన్నవారిని గుర్తించి, ఆ కుర్రాళ్ళందరికీ బోలెడన్ని మార్కులేసేస్తాడనీ ఎదవ సోదంతా చెప్పేవారు.]

మీకందరికీ ఓ విషయం చెప్పాలసలు.

పూర్వం బ్రాహ్మలిళ్ళలో ఏడేళ్ళ వయసులోనే ఉపనయనం చేసేవారు. తద్వారా ఆ కుర్రవాడికి యజ్ఞోపవీతం మెళ్ళో ఉండేది. దాదాపుగా గడచిన నలభై సంవత్సరాల కాలంలో ఎంతమంది బ్రాహ్మలు ఏడేళ్ళకీ, పదేళ్ళకీ ఇలా ఒడుగులవీ చేస్తున్నారు?

ఆమాటకొస్తే పెళ్ళికి అడ్డు రాకూడదని, అంటే ఉపనయనం జరక్కపోతే వివాహం చేసుకోవడానికి అనర్హుడని ఇప్పుడు కొత్తగా పెళ్ళికి ఓ వారం ముందు ఉపనయనాలు చేసుకునే బ్యాచ్‌లే చాలావరకు!

అటువంటప్పుడు పాడుతా తీయగాకి వచ్చే పదిపన్నెండేళ్ళ గుంటడికీ, పద్దెనిమిదేళ్ళ పడుచువాడికీ జంధ్యాలు తగలడం దాదాపు అసాధ్యం.

K Viswanath

అంచేత మీ బొంద!

ఇంకొకటేవిఁటంటే… ఈ ఉపనయనం, యజ్ఞోపవీతం కాన్సెప్ట్ ఒఖ్ఖ బ్రాహ్మల్లోనే కాదొరేయ్! క్షత్రియులు, విశ్వబ్రాహ్మణులు కచ్చితంగా పాటిస్తారు. వారికే అసలు పట్టింపులెక్కువ. ఆ విషయం మీకు తెలీదని నేననుకోను. తద్వారా మీ లెక్కలో పెద్ద ..క్కుంది!

ఇహ విశ్వనాథ్‌గారి దగ్గరకొద్దాం.

ఈయనా భుజాలు తడుముతాట్ట!

ఒరేయ్, నాకు తెలీకడుగుతానూ….

జంధ్యం వేసుకున్న కుర్రాళ్ళతోనే సినిమాలు తీసేవాడైతే ఆత్మగౌరవం, ఆపద్బాంధవుడు, స్వయంకృషి, శుభలేఖ, స్వర్ణకమలం, జననీ జన్మభూమి, సూత్రధారులు… అంటూ కాపుల్నీ కమ్మారినీ ఎందుకు హీరోలుగా పెట్టుకుంటాడ్రా?

ఇళయరాజాతో సంగీతం…

వంకాయల సత్యనారాయణతో అనుబంధం…

డీవీఎస్ ప్రొడక్షన్స్ రాజుగారితో జీవనజ్యోతి, జీవితనౌక, కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతమంటూ పదుల సంఖ్యలో సినిమాలు… ఇవన్నీ కేబుల్ కనెక్షన్లు కావే?

అంచేత…. ఈ కథలో నీతేవిఁటంటే….

ఎవడైనా బ్రాహ్మడు పోగానే ఇంకా దశాహం కాకుండానే పిండం పెట్టడం కంటే ముందే కాకులతో పోటీపడుతూ వచ్చి వాలిపోకండి.

వాలితే వాలారు, కాస్త కరెంటు తీగలవీ చూసుకు వాలి చావండి. మావాళ్ళిచ్చే షాక్ ట్రీట్‌మెంట్‌ ఇలానే ఉంటుంది.

భుజాలు తడిమే వరష్టు జోకు చెప్పి అనవసరంగా మీ భుజాలు తడుముకోకండి!

ఇప్పటికిది చాలు! మరో బ్రాహ్మడి దశదినకర్మప్పుడు మళ్ళీ కలుద్దాం!

హరహరమహదేవ!

  • కొచ్చెర్లకోట జగదీశ్

Also Read :

సంగీత సాహిత్య సమలంకృతే

Also Read :

వాణీ జయరాం గానం- పాటల బృందావనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్