Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంగీత సాహిత్య సమలంకృతే

సంగీత సాహిత్య సమలంకృతే

He Lives on forever…:
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో…
ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో…
ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో…
అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్!

అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!!

అతను మనింట్లోకి తొంగిచూసే మావయ్యలాంటివాడు. మనం తినేతిండినీ, మాటాడే మాటనీ ప్రతి సినిమాలోనూ ప్రతిబింబించిన దర్పణంలాంటివాడు.

అతను వినిపించిన సిరిసిరిమువ్వల సవ్వడి ఇంకా మన లోగిళ్ళలో ఘల్లుమంటూనే వుంది. ఆయనారేసిన సిరివెన్నెల మన డాబాలమీదింకా పరుచుకునేవుంది.

చిత్రాల్లో కళకోసం తపనపడే వాళ్ళుంటారు. కళనే చిత్రాలుగా మలచిన ఆధునిక శిల్పి అతడు! సంగీతమొక కన్ను, నాట్యమింకో కన్ను, వినోదమే మూడోకన్నైన విశ్వనాథుడతడు! ఆచిత్రాలు అత్యంత విచిత్రాలు!

అక్కడ తల్లిచాటు బిడ్డలుంటారు.

తండ్రికి భయపడుతూనే పక్కింటి పేదమ్మాయిని పెళ్ళాడతానని తెగెయ్యకుండానే చెప్పేసే కొడుకులుంటారు.

ప్రేమించిన పిల్లకోసం అప్పడాలు, వడియాలు అమ్మిపెట్టే మంచబ్బాయిలుంటారు.

ఎదిగిన పిల్లలు ఎగిరిపోయినా ఎనలేని ధైర్యంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే తండ్రులుంటారు

ఆయన సంగీతానికి వెయిటిస్తారు. అందుకే…. వెయిటర్ చేతకూడా సంగీతం పాడిస్తారు.

శాస్త్రీయ సంగీతాన్ని హేళనచేస్తే తిట్టింది శంకరశాస్త్రి కాదు…విశ్వనాథుడే!

భరతనాట్యాన్ని భ్రష్టుపట్టిస్తే ఆ గణపతి ముందు తన ఆవేదనంతా వెళ్ళగక్కిందికూడా ఆయనే!

తల్లినో చెల్లినో అవమానించినట్టు తపనపడిపోయాడు..తల్లడిల్లిపోయాడు!

తెలుగునేలపై నర్తనమాడే అవకాశాలు లేక అలమటించే అభాగ్యుల కాళ్ళకి అతడు కట్టిన ‘సిరిసిరిమువ్వ’ల సవ్వడి ఇప్పటికీ వినబడుతోంది

కులమన్న వ్యాకులతను మనసులో నింపుకుని, కులటగా మార్చాలనుకునే కుటిలమానవులను అతడొదిలిన ‘శంకరాభరణం’ ఇంకా కాటేస్తూనే వుంది

జీవనదిలాంటి కళాస్రవంతికి నిరంతరం అడ్డుపడే పేదరికపు పాకుడురాళ్ళను దాటించేందుకు అతడిచ్చిన చేయూత ఆ నదుల్ని ‘సాగరసంగమా’నికై పరుగులు తీయిస్తోంది

కల్లాకపటమెరుగని మనసే దేవునిమందిరమని ఆ చేతినుంచి జాలువారిన ‘స్వాతిముత్యం’ నిరూపించింది

దైవమిచ్చిన కళకు మెరుగులద్ది బురదలో పడివున్న కమలాన్ని ‘స్వర్ణకమలం’గా తీర్చిదిద్దే నైపుణ్యం అతనొక్కడికే వుంది

మూలాల్ని మరిచి, విలువలను విడిచినవారి జీవనవీణకు ‘శ్రుతిలయలు’ కరువౌతాయన్న ఆతని మాట నిజమేనని రుజువౌతూనే వుంది

అసూయాగ్నిలో అమాయకులు బలైనా ఆ మండేమంటలే ‘స్వాతికిరణాలు’గా ప్రకాశిస్తాయనీ మనకెప్పుడో అర్ధమైంది

అంధకారానికి బంధువై నిలిచి, వెలుగుల ‘సిరివెన్నెల’ను పంచి, తెలవారుతూనే మాయమైన చందమామను చూస్తే మన కన్ను ఇప్పటికీ చెమరిస్తుంది

కళను, కళాకారులను, కళారంగాన అసూయాద్వేషాలను కళ్ళకు కట్టినట్టు తెరమీద కనికట్టుచేస్తాడు!

తెలుగు కళామతల్లిని ‘ఉండమ్మా బొట్టుపెడతా!’ అంటూ సగౌరవంగా సత్కరించడం ఆతడి సంస్కారం

పగలూ, ప్రతీకారాల వికారాల మధ్య తెలుగువాడి ‘ఆత్మగౌరవం’ నిలబెట్టిన ‘ఆపద్బాంధవుడు’ ఆయన

పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించొద్దన్న వారి సందేశం దేశానికే ఆదేశం!

అందరూ చూసే గోదారి అతనికింకోలా కనబడుతుంది.
అందరం వినే సంగీతం వారికింకోలా వినబడుతుంది.

Viswanath

డప్పు సాంబయ్య, వెయిటర్ మూర్తి, అమాయకపు శివయ్య, అంధుడైన హరిప్రసాద్….ఎవరు వీళ్ళంతా? సమాజంలో వీరి స్థానం ఏమిటి?

జనసామాన్యం వీరికి ఎలాంటి విలువనిస్తారో మనకందరికీ తెలుసు.

కానీ ఆతని సారధ్యంలో వీరంతా సర్వజనామోదం పొందిన సహృదయమూర్తులు.

కిక్కిరిసిన భావోద్వేగంలో చూస్తూంటాం ఈ సన్నివేశం…..

“నాప్రాణదీపమై నాలోన వెలిగే…..!” ఆతరవాత తెరలుతెరలుగా దగ్గు, పాడాలనివున్నా పాడలేకపోవడం, అదుగో….ఆక్షణం కోట్లాదిమందికి ఒళ్ళు గగుర్పొడిచేలా సుస్వరం వినవస్తుంది.

శరీరమంతా ఏదో పులకింత కలిగి ఏడుపు తన్నుకొస్తుంది..ఇది ఏఒక్కసారో కాదు. చూసిన ప్రతిసారీ అలానే అనిపిస్తుంది.

ఉబికివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చూస్తాం మరో దృశ్యం…..

“ తపముని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాస్యం……!?!?” అద్భుతంగా నర్తిస్తున్న పాదాలు అచేతనం. ఒక్కసారిగా నిశ్శబ్దం!

Viswanath
చలనంలేని తల్లి శరీరం, చెమర్చడమే మరచిన కన్నులద్వయం…..!

ఒక్కసారిగా “ధిరనధిరననన తకిటతకిటధిమి”
అని విన్నంతనే ఎవరూచూడకుండా ఎక్కెక్కి ఏడ్చేవాళ్ళు ఇప్పటికీ వుంటారు.

ఇది నిజం. తల్లిపాలంతటి నిజం. కల్మషం, కల్తీలేని ఈదృశ్యాలు కళామతల్లి కిరీటంలో పచ్చలూ కెంపులూ!

కళనేకాదు. కళాకారుణ్ణీ గుర్తించాలనే ఈయన ‘వేదాంతం’ కావాలి ప్రతివారికీ సిద్ధాంతం.

బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, తప్పెటగుళ్ళు కనబడతాయి మనకిక్కడ!
గంగిరెద్దుల్ని తిప్పేవాళ్ళచుట్టూ కథంతా తిప్పిన ఘనత ఈకాశీనాధుని విశ్వనాథుడిది!

యాయవారాలు, జోలెపట్టి సంగీతార్చన చెయ్యడాలు…..ఒకటేమిటి, మన సంస్కృతీ సంప్రదాయాల్ని తెరనిండుగా ఆవిష్కరించిన నిజమైన నిర్దేశకుడితడు.

అన్నవరం గుర్తొచ్చినపుడల్లా సత్యనారాయణ స్వామి ప్రసాదం రుచి, శంకరాభరణం తీసిన వీరి అభిరుచి గుర్తొచ్చి తీరతాయి.

నలుగుర్లోకీ బయటికెళ్ళినపుడు మంచి బట్టలేసుకుంటాం.
నలుగురం ఇంట్లోవున్నప్పుడు మంచి సినిమాలేసుకుంటాం.
…….ఇదిగో, ఇతనివే ఆసినిమాలు!

“ఎవరెంతచేసుకుంటే అంతేకాదా దక్కేదీ!” అని ఆరుద్రగారన్నారు నిజమేగానీ…..మనం తక్కువ పుణ్యం చేసుకునీ ఎక్కువ ఫలితం పొందేస్తున్నామనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూస్తే!

వయసు ప్రభావం శరీరానికే తప్ప ఆచంద్రతారార్కమైన ఆ కీర్తినేమి చెయ్యగలదు? దశాబ్దాలకు పూర్వమే నిక్కమైన పానిండియా దర్శకుడితడు. ప్రపంచంలోని ప్రతి తెలుగువాడూ సగర్వంగా చెప్పుకునేవాడు మాకొక విశ్వనాథ్ ఉన్నాడని!

ఎవరైనా ఎవరితడని అడిగితే గర్వంగా చెప్పండి…“అది మనవూరి కోయిలమ్మ!” అని!

విశ్వనాథార్పణం!

-డాక్టర్ జగదీశ్ కొచ్చెర్లకోట

Also Read :

కన్నీటి జలపాతాల్లో…ఆగకసాగే బతుకుగానం..

Also Read :

మాట పరిమళం .. పాట పరవశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్