Saturday, November 23, 2024
HomeTrending Newsఢిల్లీలో బతుకమ్మ సంబురాలు

ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు

ఎక్కడైతే ఆంక్షలు పెట్టి బతుకమ్మ ఆడనివ్వలేదో అక్కడే ఇవాళ సాంస్కృతిక శాఖ మంత్రిగా బతుకమ్మ పండుగకు హాజరయ్యే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలంతా బతుకమ్మ పండుగ నిర్వహించుకోవటం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ ఉద్యోగులు, తెలుగు ప్రజలతో కలసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులతో కలసి బతుకమ్మ ఆడి మహిళలను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు ఆంక్షలతో బతుకమ్మ చేశామని… ఇప్పుడు సగౌరవంగా, అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో ఇండియా గేట్ వద్ద తొలిసారిగా బతుకమ్మ వేడుకలు నిర్వహించిందంటే అందుకు గల కారణాలను అందరూ గుర్తించాలని మంత్రి కోరారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఉద్దేశంతోనే బతుకమ్మ వేడుకలను కేంద్రం నిర్వహించినట్లుగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో మన దేశంతో పాటు 65 దేశాల్లో ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్ లో ఉద్యమ సమయంలో మన ఉద్యోగులు, అధికారులు బతుకమ్మను నిర్వహించి తెలంగాణ ఆకాంక్షను చాటారని మంత్రి వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో బాలగంగాధర తిలక్ వినాయక చవితి ఉత్సవాలను ఏ విధంగా వినియోగించుకున్నారో అదే తరహాలో తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

దేశంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణకు ఎగువన ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం… తెలంగాణలోని కరువు ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరించడం అన్యాయమన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించకూడదన్నారు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డా. మందా జగన్నాధం, మాజీ ఎంపీ హనుమంతరావు, టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీఓ ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, భాగ్యనగర్ టీఎన్జీఓ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్, తెలంగాణ భవన్ ఉద్యోగుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read : బతుకమ్మ ప్రాశస్త్యం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్