Pandya, Dhawan down: బిసిసిఐ తాజా సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది…. గాయం కారణంగా వైదొలిగి ఆ తర్వాత జట్టులోకి వచ్చినా సరైన ప్రతిభ చూపలేకపోయి మళ్ళీ చోటు కోల్పోయిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సెంట్రల్ కాంట్రాక్టును ఏ నుంచి సి గ్రేడ్ కు బిసిసిఐ మార్పు చేసింది. పాండ్యా పాటు కేవలం వన్డే సిరీస్ మాత్రమే ఆడుతున్న శిఖర్ ధావన్ ను కూడా ఏ నుంచి సి కి మార్చారు. వీరిద్దరితో పాటు రెండేళ్లుగా విఫలమవుతూ వచ్చి ఇటీవలే ఉద్వాసనకు గురైన టీమిండియా టెస్ట్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రెహానే లకు కూడా బిసిసిఐ షాకిచ్చింది. ప్రస్తుతం ఏ గ్రేడ్ లో కొనసాగుతున్న వీరిద్దరినీ బి గ్రేడ్ లోకి మార్చింది. వీరిద్దరితో పాటు బౌలర్ ఇషాంత్ శర్మను కూడా ఏ నుంచి బి గ్రేడ్ కు మార్చారు. అలాగే ఇటీవలే ఓ రిపోర్టర్ బెదిరించాడని, టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ తనకు రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని సలహా ఇచ్చాడని వార్తల్లోకి ఎక్కిన వికెట్ కీపర్- బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహా ను బి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ కు మార్చారు.
అయితే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం సి గ్రేడ్ లో ఉన్న అతన్ని బి గ్రేడ్ కు అప్ గ్రేడ్ చేశారు.
బిసిసిఐ ఏ ప్లస్, ఏ, బి, సి… నాలుగు గ్రేడ్లుగా ఆటగాళ్లను విభజించి వారికి స్పెషల్ కాంట్రాక్ట్ పద్దతిలో వేతనం చెల్లుస్తోంది. ఏ ప్లస్ ఆటగాలకు ఏడాదికి 7 కోట్ల రూపాయలు, ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, సి గ్రేడ్ లో ఉన్న ఆటగాళ్లకు ఏటా కోటి రూపాయలు చెల్లిస్తోంది.
ఏ ప్లస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, మహమ్మద్ షమీలు ఏ గ్రేడ్ లో ఉన్నారు. గతంలో ఈ గ్రేడ్ లో పదిమంది ఉండేవారు. ఇప్పుడు ఐదుగురికే చోటు దక్కింది.
బి గ్రేడ్ – పుజారా, రెహానే, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, సిరాజ్, ఇషాంత్ శర్మ
సి గ్రేడ్ – శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కమార్, వాషింగ్టన్ సుందర్, శుభమన్ గిల్, హనుమ విహారీ, యజువేంద్ర చాయాల్, సూర్య కుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్
సూర్య కుమార్ యాదవ్ కు కొత్తగా చోటు దక్కగా…. కులదీప్ యాదవ్, నవదీప్ శైనీలను కాంట్రాక్ట్ లిస్టు నుంచి డ్రాప్ చేశారు.
గతంలో ఈ కాంట్రాక్టు లిస్టులో మొత్తం 28 మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 27కి పడిపోయింది.
Also Read : ఎల్లుండి నుంచి మహిళా వరల్డ్ కప్