Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమహిళా క్రికెటర్ల పారితోషికం పెంపు

మహిళా క్రికెటర్ల పారితోషికం పెంపు

Equality:
“అప్పువడ్డది సుమీ భారతావని వీని సేవకున్”

కులవ్యవస్థలో అంటరానివారుగా ముద్ర పడి, అణచివేతకు గురైనవారి గురించి “గబ్బిలం” ఖండ కావ్యంలో జాషువా అన్న మాట ఇది. భారతీయ సమాజంలో మహిళల పరిస్థితికి కూడా ఈ పద్యపాదం అన్వయమవుతుంది.

ఆచారమో, కట్టుబాట్లో, నమ్మకాలో, పురుషాధిక్యతో, అవగాహనా రాహిత్యమో, స్త్రీని సౌందర్య వస్తువుగా చూసే దృష్టి లోపమో…పేరేదయినా మహిళలకు భారతీయ సమాజం చేసిన అన్యాయం మాత్రం చిన్నది కాదు.

“యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః,
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాః తత్రాఫలాః క్రియాః”

అని మహిళను పూజించాలన్న ఆదర్శ శ్లోకం మాత్రం గట్టిగానే చెబుతున్నాం. ఆచరణలో మాత్రం “అబల” అని పేరు పెట్టి బలహీనం చేశాం.

ఆడది, ఆడుది, ఆడ పిల్ల, ఆడవారు మాటల్లో ఉన్న “ఆడ” వ్యుత్పత్తి మీద స్పష్టత లేదు. ఎప్పటికయినా ఇక్కడ-ఈడ కాకుండా అత్తారింటికి అక్కడ-ఆడ వెళ్లాల్సిందే కాబట్టి అక్కడిది- ఆడది అయ్యిందన్న వాదన మీద భిన్నాభిప్రాయాలున్నాయి. ద్రావిడ పద వ్యుత్పత్తి లోతులకు వెళితే గానీ…ఇది తేలే విషయం కాదు.

వెయ్యేళ్లకు పైబడి ఉన్న తెలుగు సాహిత్యంలో ఆడది అన్న మాట సామాన్య స్త్రీ వాచకంగానే ఉంది. ఈమధ్య స్త్రీ, మహిళ, మగువ మాటలతో పోలిస్తే ఆడది మాట అంత గౌరవ వాచకం కాదనే అభిప్రాయం స్థిరపడుతోంది. ఆడదానిలా అన్నిటికీ ఏడుస్తావు; ఆడంగి మాటలు; ఆడంగి చేష్టలు…లాంటి అనేక మాటల వల్ల బహుశా ‘ఆడది’ మాటకు విలువ తగ్గి ఉండవచ్చు.

తమిళంలో మకన్- మగన్ అంటే కొడుకు. తెలుగులో మగవాడు అంటే కొడుకు కాదు. పెద్దవాడయిన పురుషుడు.

“మన యశోద చిన్ని మగవాని కనెనట”
అని పోతన భాగవతంలో “చిన్ని కొడుకు” అనడానికి “చిన్ని మగవాడిని” అని ఉపయోగించాడు. అంటే తమిళంలో “మగన్” కొడుకులా…తెలుగులో కూడా “చిన్ని మగవాడు” కొడుకుకు పర్యాయపదంగా ఒకప్పుడు ఉండేది. తరువాత ఎప్పుడో అబ్బాయి, బాబు వచ్చి “చిన్ని మగవాడు” మాయమయినట్లున్నాడు. ఇప్పుడెవరయినా ఫలానా ఆమె “చిన్ని మగవాడిని” కన్నది అనగలరా?

చెబితే బాగోదు కానీ…తెలుగు లింగ, వచన, విభక్తి వ్యాకరణ నిర్మాణంలో కూడా మహిళలకు అన్యాయమే జరిగింది. “స్త్రీ తిర్యక్ జడ భిన్నంబులును, వాటి విశేషంబులును మహత్తునాబడు” అని చిన్నయసూరి సూత్రం. స్త్రీ, జంతువు, జడపదార్థాలతో పాటు వాటి విశేషాలు కాకుండా మిగతావి పుంలింగాలన్నారు.

ఉదాహరణకు:-
స్త్రీ-
ఆమె అరుస్తోంది.

జంతువు-
కుక్క అరుస్తోంది.

జడం-
కొండ కోయని అరుస్తోంది.

పురుషుడు-
అతను అరుస్తున్నాడు.

 Equity Pay

ఆమెకు- కుక్కకు-కొండకు క్రియాపదంలో ఏమీ తేడా లేదు. చివరికి జడమయిన కొండ కూడా వ్యాకరణాన్ని అలుసుగా తీసుకుని కో అని అరుస్తోంది.

అరిచింది/అరిచాడు ఏకవచన క్రియాపదమయ్యే సరికి గౌరవం తగ్గింది. దాంతో ది/డు తీసేసి బహువచన సూచకమయిన “రు” పెట్టి…అరిచారు అని గౌరవాన్ని చివర అతికించాం. అరిచింది అతడయినా…ఆమె అయినా బహువచనంలో అంతా ఒకటే.

మగధీర అంటే స్త్రీ:-
మగ తెలుగు. ధీర సంస్కృతం. మగధీర దుష్ట సమాసం. “మహానాడు”లా ఎన్నో దుష్ట సమాసాలకు ఆమోదం దొరుకుతోంది కాబట్టి అది పెద్ద తప్పు కాకపోవచ్చు. స్త్రీ అయితే ధీర; పురుషుడయితే ధీరుడు అనే రావాలి. స్త్రీ గురించి చెబుతూ మగవారిలా ఆమె ధీర అనే అర్థంలో అయితే “మగధీర”. పురుషుల గురించి చెబుతూ మగవారిలో ధీరుడు అనే అర్థంలో అయితే “మగధీర” మాట రాదు. ఆమె పాడాడు అన్నప్పుడు ఎలాంటి దోషమో ఇది కూడా అలాంటి దోషమే అవుతుంది.

“మగధీర” సినిమాలో హీరోయిన్ ఇతివృత్తంగా ఈ పేరు పెట్టి ఉంటే ఇందులో చాలా లోతయిన ఉద్దేశం ఉన్నట్లు. హీరో ఇతివృత్తంగా అయితే- “మగధీరుడు” అని ఉండాల్సింది. వాడుకలో ఉండడం వల్ల కొన్ని వ్యాకరణ విరుద్దమయిన మాటల చెల్లుబాటును ప్రశ్నించలేం.

 Equity Pay

భాషలో, భావంలో మహిళలను తక్కువ చేస్తూ వచ్చామని తెలుసుకుని…ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం.

భారత క్రికెట్ బోర్డు ఇన్నాళ్లకు కళ్లు తెరిచి…ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్ల రెమ్యునరేషన్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుని…తక్షణం అమల్లో పెట్టింది.

తరతరాలుగా అంతర్జాతీయ టెన్నిస్ లో ఇదే పరిస్థితి ఉండేది. దీని మీద చర్చోపచర్చలు జరిగి…జరిగి…చివరకు టెన్నిస్ లో స్త్రీ, పురుష క్రీడాకారులకు ఒకే రెమ్యునరేషన్ స్థిరపరిచారు.

క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం వ్యూయెర్షిప్, ప్రకటనలు, ప్రసార హక్కుల వేలం లాంటివి పరిగణలోకి తీసుకున్నప్పుడు పురుషుల క్రికెట్ క్రీడకు ఉన్నంత ఆదరణ మహిళల క్రికెట్ క్రీడకు ఉండదన్న కొలమానంతో ఇన్నాళ్లూ మహిళా ప్లేయర్ల రెమ్యునరేషన్ గురించి ఆలోచించినట్లు లేరు. ఇప్పటికయినా తప్పును దిద్దుకున్నందుకు బి సి సి ఐ ని అభినందించాలి.

ఎందుకంటే…
కొన్నిటిని డబ్బుతో కాకుండా మనసుతో కొలవాలి. సామాజిక కోణంలో చూడాలి. లింగ వివక్షను తొలగించాలన్న ఆదర్శంతో చూడాలి. కాలం చేసిన గాయానికి కాలమే ఎప్పుడో ఒకప్పుడు మందు పూయాలన్న ఎరుకతో చూడాలి.

మనం మహిళకు చాలా అప్పుపడి ఉన్నాం. ఇలాంటివి ఎన్ని చేసినా ఆ అప్పు ముందు చంద్రుడికో నూలు పోగు లాంటివే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

కోహ్లీ విశ్వరూప విన్యాసం

RELATED ARTICLES

Most Popular

న్యూస్