దేశానికి స్వతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా వెనుకబడిన తరగతులకు పూర్తి న్యాయం చేయలేకపోయామని రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ జనాబాకు తగినట్లుగా సమాన అవకాశాలు ఇవ్వాలన్న వారి చిరకాల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచిన డా. బిఆర్ అంబేద్కర్ కు అందరం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే స్పూర్తితో…. బిసి జనగణన చేసి తద్వారా వారికి తగిన అవకాశాలు కల్పించలేక పోతున్నామని అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో ‘స్పెషల్ మెన్షన్’ ద్వారా విజయసాయి ఈ అంశాన్ని ప్రస్తావించారు.
విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో… రాష్ట్ర, కేంద్ర చట్టసభల్లో… న్యాయశాఖ అత్యున్నత పదవుల్లో బిసిలకు వారి జనాభా ప్రాతిపదికన రావాల్సిన వాటా కల్పించాల్సిన అవసరం ఉందని సభ దృష్టికి తీసుకు వచ్చారు. దేశ జనాభాలో 50శాతం పైగా బిసి జనాభా ఉన్నా వారి రిజర్వేషన్ కోటా దాదాపు 27శాతానికే పరిమితమైందని చెప్పారు. రిజర్వేషన్ కోటా 50శాతానికి మించి ఉండకూడదన్న నియమాన్ని సుప్రీం కోర్టు ఎత్తి వేసిన విషయాన్ని విజయసాయి సభ కు గుర్తు చేస్తూ కోటా పెంచడం ద్వారా రాజ్యంగా మౌలిక సోత్రాలకు ఏమాత్రం విఘాతం కలగదని కూడా అత్యున్నత న్యాయస్థానం చెప్పిందని పేర్కొన్నారు. న్యాయ పరమైన ఇబ్బల్దులు కూడా లేనందున బిసిలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ కల్పించే విషయమై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.