తన వయసు గురించి మాట్లాడుతున్న జగన్ కు దమ్ముంటే తనలాగా రెండురోజుల పాటు మిట్ట మధ్యాహ్నం రెండు బహిరంగసభలు పెట్టి మాట్లాడాలని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. తన వయసు గురించి, చేసిన పనుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. టిడిపి చేపట్టిన ప్రజాగళం యాత్ర మధ్యాహ్నం కూడా అశేష జనదోహంతో కిక్కిసిరిపోతుంటే…. మేమంతా సిద్ధం అంటూ సాయంత్రం పూట వారు ఏర్పాటు చేసుకుంటున్న సభలు వెలవెలబోతున్నాయని.. ప్రజలు రాక, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలిస్తున్నారని బాబు ఎద్దేవా చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారని… నేటికి ఈ పార్టీ 43 ఏళ్ళు పూర్తి చేసుకుందని, చరిత్రలో ఓ సుస్థిర స్థానం తమ పార్టీ సంపాదించుకుందని బాబు పేర్కొన్నారు.
సిఎం జగన్ రాయలసీమ ద్రోహిగా మిలిగిపోతారని, ఆయన ఈ ప్రాంతంలో పుట్టడం మన ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. మాదిగ వర్గీకరణ మొదట చేసింది తామేనని, కానీ ఆ తర్వాత కోర్టులు దాన్ని నిలిపి వేశాయని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నందున ఈ అంశానికి త్వరలోనే సానుకూల పరిష్కారం లభిస్తుందని అందుకే మాదిగలు తమ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటూ జగన్ ప్రశ్నించారని కానీ ఈ ఐదేళ్ళ పాలనలో ప్రజలందరూ నష్టపోయారని బాబు విమర్శించారు. సీమలో నీటి ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితంగానే కర్నూలులో తీవ్రమైన నీటి కొరత ఏర్పడిందని… వారం పదిరోజులకోసారి స్నానాలు చేస్తున్నారని… రాయలసీమలో ఈ పరిస్థితికి జగనే కారణమని విమర్శించారు.
తమ సభలకు యువత పెద్దఎత్తున వస్తున్నారని… ఇక్కడ కూడా యువ కిశోరాలు సింహగర్జన చేయడానికి వచ్చారని…. ఇదే స్పూర్తితో పనిచేసి ఫ్యాన్ ను రెక్కలు విరిచి డస్ట్ బిన్ లో పడేయాలని కోరారు. ఫ్యాన్ ను చెత్త కుండీలో పడేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు లేదని అన్నారు.