ఒకప్పుడు మంచి హైటూ .. పర్సనాలిటీ ఉన్నవారే హీరోలుగా రాణించారు. ఇప్పుడు ట్రెండ్ మారింది .. హీరో అంటే ఇలా ఉండాలనే కొలతలేం లేవు. హీరో బాగుంటే కటౌట్ బాగుందని అంటున్నారు .. కథ బాగుంటే కంటెంట్ బాగుందని చెబుతున్నారు. ఒకప్పుడు హీరోలు సినిమాల్లో తమ పాత్రను విలన్స్ గుర్తుపట్టకుండా ఉండవలసిన సందర్భాల్లో మాత్రమే డిఫరెంట్ గా కనిపించడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పటి హీరోలు ప్రతి సినిమాలోను కొత్తగా కనిపించవలసిందే.

కథలో ఎంతవరకూ కొత్తదనం ఉంటుందనే విషయం పక్కన పెడితే, లుక్ తోనే హీరో ఆడియన్స్ లో అంచనాలు పెంచేయాలి. కొత్తగా కనిపించడం కోసం జిమ్ లోనే కసరత్తులు చేయాలి. సిక్స్ ప్యాక్ తో తెరపై కనిపిస్తే అదో ఆనందం .. అటు హీరోకి .. ఇటు అభిమానులకు కూడా. అయితే హీరోలు ఎంత డిఫరెంట్ గా కనిపించడానికి ట్రై చేసినా .. ఫైట్లలో .. డాన్సులతో ఎంతగా రెచ్చిపోయినా అక్కడ ఉండవలసింది వైవిధ్యభరితమైన కథనే. సరైన కథ అంటూ ఉంటే ఎన్ని విన్యాసాలు చేసినా చెల్లుతుంది. సరైన ప్రయత్నం చేసినప్పుడే ఫలిస్తుంది.

అందుకు ఉదాహరణగా ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం బెల్లంకొండ తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడు. బాలీవుడ్ లో తన జెండా ఎగరేయడానికి నానా కష్టాలు పడ్డాడు. ప్రభాస్ ను మాస్ హీరోగా నిలబెట్టిన కథను పట్టుకుని ప్రయోగం చేశాడు .. అది కాస్త వికటించింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ఈ సమయంలో, ఆయన ఎప్పుడో చేసిన తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేయడమే బెల్లంకొండ చేసిన పొరపాటు. ఇక ఇప్పడు ఆయన సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఇక్కడ చాలా గ్యాప్ వచ్చేసింది గనుక, ఇకపై తన కెరియర్ విషయంలో ఆయన మరింత కేర్ తీసుకోవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *