Bharat Rashtriya Samithi : కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. భారత్ రాష్ట్రీయ సమితి(BRS) పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, త్వరలోనే ఈ పేరు రిజిస్టర్ చేయించనున్నట్లు తెలిసింది. కొత్త పార్టీని ఈ నెలాఖరులో కెసిఆర్ ఢిల్లీలో ప్రకటించే వీలుంది. కారు గుర్తు సైతం అడిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త జాతీయ ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఈ భేటీలో చూచాయగా బిఆర్ఎస్ గురించి కెసిఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు ఐదు గంటలపాటు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే…
రాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకోవాలి..
‘బిజెపి ఆగడాలు పెరిగిపోయాయి. ఆ పార్టీ వల్ల దేశం అధోగతి పాలైంది. కాంగ్రెస్ విపక్షంగానూ విఫలం అయినందున.. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పాత్రను కొత్త పార్టీ పోషిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు వేదికగా ఉపయోగించుకోవాలి. వివిధ పార్టీలను ఏకం చేసి ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడం ద్వారా బిజెపికి తగిన గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయం. ఈ వ్యూహం అమలులో భాగంగా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. తెలంగాణ పాలన, పథకాలకు దేశ వ్యాప్తంగా స్పందన లభిస్తోంది. కేంద్రం దీన్ని జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకే రుణాలపై ఆంక్షలు విధిస్తోంది
దీనిని దీటుగా ఎదుర్కొందాం. భావ సారూప్య పార్టీలతో సమావేశమై వ్యూహం రూపొందిద్దాం. ఆంక్షల ఎత్తివేతకు కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. దీని కోసం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి. దేశంలో బిజెపి ఆగడాలు శృతిమించుతున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది’ అని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ తరుణంలో వ్యవస్థను చక్కదిద్దేందుకు కొత్త పార్టీ అవసరం ఉందని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.
మంత్రులు సైతం కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత తాను ముఖ్యమంత్రిగానే ఉంటూ దేశం కోసం పని చేస్తానని సీఎం చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ ఇకపై జాతీయ రాజకీయాలకు అడ్డాగా మారుతుందని ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టిఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించే ప్రతిపాదన వచ్చినా.. అలా కాకుండా కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొత్త పార్టీకి జై భారత్, నయా భారత్, భారత రాష్ట్రీయ సమితి తదితర పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
పేరు, జెండా తదితర అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సిఎం కోరినట్లు సమాచారం. మరో పక్క తమిళనాడు, బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ గవర్నర్ను విశ్వవిద్యాలయాల కులపతి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ముఖ్యమంత్రికి అధికారాలు అప్పగించేందుకు అవసరమైన కార్యాచరణపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
బిజెపి సమావేశాల కంటే ముందే…
హైదరాబాదులో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెలలో జరుగనున్నాయి. దీనికంటే ముందే జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్, హరీష్ రావు, మహమ్మద్ మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్, సంతోష్ కుమార్, రవిచంద్ర, దామోదరరావు, శాసనసభ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్ లు బాల్క సుమన్, ఎమ్మెల్యే ప్రభాకర్ రావు, గువ్వల బాలరాజు, మాజీ సభాపతి మధుసూధనాచారి పాల్గొన్నారు.
Also Read : రాష్ట్రపతి ఎన్నికలపై తెరాస వ్యూహం?