మాజీ ప్రధానమంత్రి, తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. మరో ఇద్దరు ప్రముఖులకు కూడా అత్యున్నత పురస్కారం ప్రకటించింది. మాజీ ప్రధాని చరణ్ సింగ్, భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. తెలుగు బిడ్డకు అత్యున్నత పురస్కారం లభించింది. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
భారత రత్న సాధించిన తొలి తెలుగు బిడ్డగా పీ.వీ.నరసింహారావు నిలిచారు. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్.కె.అద్వానీలకు భారత రత్న ప్రకటించిన కేంద్రం తాజాగా మాజీ ప్రధానులు పీ.వీ.నరసింహారావు, చరణ్ సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ దఫా మొత్తం ఐదుగురికి భారత రత్న అత్యున్నత పురస్కారం ప్రకటించడం విశేషం.
పీ.వీ.నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈ పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారత వ్యక్తి పీ.వీ కావడం విశేషం. సంక్షోభంలో ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి తిరి ప్రగతి బాట పట్టించిన ఘనతను పీవీ సొంతం చేసుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు 1921జూన్ 28న జన్మించి 2004డిసెంబర్ 23న మరణించారు. న్యాయవాదిగా, బహుభాషావేత్తగా, రచయితగా, సాహిత్యభిమానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పీ.వీ దేశానికి విశేష సేవలందించారు.
భారత దేశ చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఒకే ఏడాది అయిదుగురికి భారత రత్న ఇవ్వటం గమనార్హం. ఎన్నికల సంవత్సరం కావటంతో ఆయా వర్గాలను, రాష్ట్రాల ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకే కేంద్రం ఎత్తుగడగా కనిపిస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
-దేశవేని భాస్కర్