శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు పీపుల్స్ మార్చ్ కు విరామం ఇచ్చారు. బెల్లంపల్లిలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో భట్టి విక్రమార్క పాల్గొంటారు. రేపటి నుంచి యాత్ర యథాతథంగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్రలో భాగంగా బెల్లంపల్లి గ్రౌండ్స్ లో రాత్రి బస చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ రోజు ఉదయం స్థానిక వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాకింగ్ లో పాల్గొన్నారు. పట్టణ పౌరులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
నిన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భట్టివిక్రమార్క నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రకు అపూర్వ ఆధరణ లభించింది. భట్టి విక్రమార్క పాదయాత్రతో బెల్లంపల్లి జనసంద్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభిమానులు గజమాలతో స్వాగతించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చే ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని గుర్తుచేశారు.
వచ్చేఎన్నికల్లో తెలంగాణలో విజయాన్ని రాహుల్ గాంధికి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. సాధించుకున్న తెలంగాణలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధి కోసం వలసలు యధావిధిగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి బొగ్గుబావులను బంద్ చేసి స్థానికుల నోట్లో మట్టికొట్టారని ధ్వజమెత్తారు. సింగరేణిలో రిటైర్మెంట్లు జరుగుతున్నాయే తప్ప కొత్త రిక్రూట్ మెంట్లు లేకుండా పోయాయని విచారం వ్యక్తంచేశారు. నీళ‌్లు… నిధులు… నియామకాల నినాదం కాలగర్భంలో కలిసిపోగా… కేసీఆర్ కుటుంబానికి మాత్రం అన్ని రకాల పదవులు దక్కాయన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ తిరోగమనంలో సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.