Saturday, January 18, 2025
HomeTrending NewsBhumana: వైఎస్ కుటుంబం-భూమన: మూడు తరాలు.. మూడు సంఘటనలు

Bhumana: వైఎస్ కుటుంబం-భూమన: మూడు తరాలు.. మూడు సంఘటనలు

వైఎస్ కుటుంబంలోని మూడు తరాలతో తనకున్న సంబంధాన్ని, వారితో కలిసి పనిచేసిన  సందర్భాలను, సంఘటనలను టిటిడి చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేడు గుర్తు చేసుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతకుముందు తిరుచానూరు మార్కెట్ యార్డ్ సమీపంలోని సభా ప్రాంగణం పద్మావతిపురం వేదిక నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ నూతన హాస్టల్ భవనాలకు శంఖుస్థాపన చేశారు, దీనితో పాటుగా టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో భూమన మాట్లాడుతూ… తొలుత తన గురువర్యులు,  దివంగత వైఎస్ రాజారెడ్డి గారితో కలిసి ఇదే ప్రాంగణంలో వైఎస్సార్ యువసేన ఏర్పాటుచేసి ప్రభంజనం సృష్టించామని,  ఆ తర్వాత 1992లో రాజారెడ్డి తనయుడు దివగంత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి ఇక్కడే జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొన్నామని,  అసమ్మతి రాజకీయాలకు ఆ సమయంలోనే అంకురార్పణ జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు  వైఎస్ఆర్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో  ఇదే ప్రాంగణంనుంచి ఎన్నాళ్ళ నుంచో కలగా మిగిలిన టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నామని భూమన పేర్కొన్నారు.

“నిజంగా ఇది నేను సంకల్పించింది కాదు. యాదృచ్ఛికంగా జరిగింది. ఇలా మూడు తరాలు తాత, తండ్రి, కుమారుడితో  ఎంతో సాన్నిహిత్యంతో  కలిసి పనిచేసిన రాజకీయ నాయకుడిని  దేశంలో నేనేనని అనుకుంటున్నా. ఇదే కాకుండా తండ్రి, కుమారుడు వైఎస్ఆర్, జగన్ లు  సీఎంలుగా ఉన్న సమయంలోనే నేను టీటీడీ చైర్మన్‌గా చేయడం చరిత్రగా నిలిచిపోతుంది. ఇది నాతోనే మొదలు.. నాతోనే ముగింపు జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకెవరి వల్ల సాధ్యంకాదు అని గర్వంగా తెలియజేస్తున్నాను” అంటూ భూమన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.  ప్లీనరీ, అసమ్మతి రాజకీయాల గురించి భూమన ప్రస్తావించిన సమయంలో సిఎం జగన్ నవ్వుతూ దండం పెట్టడం సభికులను ఆకర్షించింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్