Sunday, September 8, 2024
Homeఅంతర్జాతీయంభూటాన్ సిగలో డిజిటల్ దివ్వె

భూటాన్ సిగలో డిజిటల్ దివ్వె

ప్రజల సంతోషం కోసమే పనిచేసే ప్రభుత్వాలు కొన్ని దేశాల్లో ఉంటాయి. అక్కడ అగ్రరాజ్యాల కోసమో, ప్రపంచబ్యాంక్ అడిగిందనో పని చెయ్యరు. తమ దేశానికి, ప్రజలకు మేలు చేస్తుందా లేదా అని మాత్రమే చూస్తారు. అటువంటి పొరుగుదేశం మనకు ఉంది. పచ్చగా కళకళలాడుతూ చుట్టుపక్కలదేశాలు వదిలే కాలుష్యాన్ని తమవరకు రాకుండా అడ్డుకుంటోంది. అందుకే ‘గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్’ తో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఓ పక్క చైనా, మరో పక్క భారత్ తో సరిహద్దులు కలిగి ఎవరి హద్దుల్లో వాళ్ళుండేలా జాగ్రత్త పడే ఆ చిన్ని దేశమే భూటాన్.

ప్రజాస్వామ్యంలో అప్రకటిత రాజుల భోగం మనకు పరిచయమే. రాజులైనా సామాన్యుల్లా జీవించడం చూడాలనుకుంటే భూటాన్ వెళ్లాల్సిందే. ప్రజలు పర్యావరణాన్ని రక్షించి తీరాలని చట్టం చేసిన దేశం కాబట్టే అరవైశాతం ఆకుపచ్చగా ఉంటుంది. దేశ రాజధాని ధింపులోనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. ఒకసారి పెట్టి ప్రజా వ్యతిరేకత వల్ల తీసేసారు. చాలాయేళ్లు వస్తుమార్పిడితోనే వ్యాపారం, జీవనం. ప్రభుత్వోద్యోగుల జీతం సైతం సరకులే. మెల్లగా కరెన్సీ వచ్చి ఇతర పద్ధతులు మొదలయ్యాయి. ఎక్కువశాతం జనాభా బౌద్ధం పాటించడం కారణమేమో హంసలా మంచివి మాత్రమే గ్రహిస్తారు.

భూటాన్ లో చిన్న చిన్న గ్రామాలు పర్వత ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అక్కడ బ్యాంకులు ఎక్కువ మందికి అందుబాటులో లేవు. వృద్ధులు బ్యాంకులకు వెళ్లడం కష్టం. ఇంటర్నెట్ , మొబైల్ సేవలు ప్రవేశించి పదేళ్లు దాటిందంతే. ప్రస్తుత జనాభాలో ఎక్కువ భాగం యువతే. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ దిశగా అడుగులేస్తోంది. శాన్ఫ్రాన్సిస్కో కు చెందిన రిపుల్ అనే సంస్థ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తోంది. తద్వారా అందరికీ లావాదేవీలు సులభమవుతాయని ఆలోచన. ఇదీ ఒకరకం వస్తుమార్పిడే కాబట్టి ప్రజలకు అలవాటవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను చక్కగా పాటించే ప్రజలకు కొత్త డిజిటల్ కరెన్సీ మరింత సంతోషం ఇస్తుందని భావిస్తున్నారు. పైగా పర్యావరణ హితం కూడా. మరి మనమెక్కడ అంటారా? ఇంటర్నెట్ ని సినిమాలకు, అక్కర్లేని విషయాలకు వాడుకోడంలో బిజీగా ఉన్నాం. అయినా భూటాన్ లాంటి చిన్న దేశాన్ని చూసి నేర్చుకుంటే పరువు తక్కువ కూడానూ. లెట్ అజ్ ఎంజాయ్ లైక్ దిస్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్