Saturday, January 18, 2025
HomeTrending Newsబీహార్లో కొత్త రాజకీయ ఫ్రంట్..జన్ సురాజ్

బీహార్లో కొత్త రాజకీయ ఫ్రంట్..జన్ సురాజ్

లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రం గా మిగిలిపోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదన్నారు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యమని, ప్రజలంతా కలసికట్టుగా అడుగు ముందుకేస్తే ఈ దురవస్థ నుంచి బయటపడతామన్నారు. జన్ సురాజ్ పేరిట కొత్త రాజకీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ విషయమై మరింత క్లారిటీ ఇచ్చారు. గురువారం పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఈ రోజు ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం అవసరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటానని స్పష్టం చేశారు. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లు పీకే వెల్లడించారు.

రాబోయే 3, 4 నెలల్లో 17 వేల మందిని కలుస్తానని చెప్పారు. అందరూ కలిసి వస్తే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానన్నారు. ఒక వేళ రాజకీయ పార్టీ పెట్టినా అది ప్రశాంత్ కిశోర్‌ది కాదని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో వీలైనంత మందిని కలుసుకుంటానని చెప్పారు. బిహార్‌లో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రస్తుతం నా ప్రణాళికలో రాజకీయ పార్టీ లేదని వివరించారు. ‘‘జన-సురాజ్ (ప్రజా సుపరిపాలన) ఆలోచనలో భాగంగా నేను సున్నా నుంచి ప్రారంభించి వచ్చే మూడు నాలుగేళ్లలో ప్రజలను కలసుకుంటాను.. నేను ఈరోజు ఏ రాజకీయ వేదిక లేదా రాజకీయ పార్టీని ప్రకటించబోవడం లేదు.. గత 15 ఏళ్లుగా బిహార్‌కు మేలు జరగలేదు.. బిహార్‌లో మార్పు కోరుకునే వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనేది నా ఉద్దేశం’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఎందుకు విఫలమయ్యాయో కూడా ప్రశాంత్ కిశోర్ వివరణ ఇచ్చారు. తన ప్రణాళికపై పని చేయడానికి కాంగ్రెస్ సుముఖత చూపిందని, అందుకు వెళ్లే మార్గంపై కూడా అంగీకరించిందని చెప్పారు. ‘కానీ కాంగ్రెస్ రాజ్యాంగంలో ఎటువంటి హోదా లేని ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్‌లో చేరాలని నన్ను కోరారు’ అని అన్నారు. బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్‌తో తాను కలిసి పనిచేయాలనుకోవడం లేదని తేల్చిచెప్పారు. నితీశ్ కుమార్‌తో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాల్లేవు.. మా మధ్య మంచి సంబంధాలున్నాయి.. కానీ, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు.. కలిసి పనిచేయడంలో వ్యత్యాసం ఉంది.. ఒకవేళ నితీష్ కుమార్ నన్ను పిలిస్తే వెళతాను.. అంతమాత్రాన ఆయనతో ఏకీభవించినట్టు కాదు.. కలిసి పనిచేసినట్టు కాదు’’ అని పీకే స్పష్టం చేశారు.

Also Read : సొంత పార్టీతో ప్రజాక్షేత్రంలోకి పీకే 

RELATED ARTICLES

Most Popular

న్యూస్