Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?

పాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?

ఆ మధ్య అంతర్జాతీయ ఫుట్ బాల్ కప్ పోటీలు జరుగుతున్నప్పుడు ఒక ఫోటో, నాలుగు సెకన్ల వీడియో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

జగద్విఖ్యాత పోర్చుగల్ ఫుట్ బాల్ క్రీడాకారుడు రొనాల్డో మీడియాతో మాట్లాడ్డానికి ప్రెస్ కాన్ఫెరెన్స్ హాల్లోకి వచ్చాడు.మైక్ ముందున్న కోక్ కూల్ డ్రింక్ బాటిళ్లను కెమెరా ఫ్రేమ్ లో పడకుండా పక్కకు జరిపి; వెను వెంటనే ఒక వాటర్ బాటిల్ ను పట్టుకుని; నీళ్లే ఆరోగ్యం అంటూ పైకెత్తి చూపి ఫ్రేమ్ లో పడేట్టు పక్కనే పెట్టుకున్నాడు.నిజానికి ఆ పోటీల ప్రధాన స్పాన్సరర్లలో కోక్ కూడా ఒకటి. ఇలా చేయడానికి, చెప్పడానికి మనసుండాలి. ధైర్యం ఉండాలి. సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి.

ఇంకొద్దిగా వెనక్కు వెళితే – మనకు బాగా పరిచయం ఉన్న హీరో ఇన్ సాయి పల్లవి ఫీల్డ్ లో నిలదొక్కుకున్న తొలిరోజుల్లో ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్లు సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తాం…మా ప్రాడక్ట్ ప్రకటనలో నటించండి అని అడిగితే…ఆమె తిరస్కరించింది.

మొహానికి రంగులు ఒక మోసం, వంచన. నేను చేయలేను…అని చెప్పినట్లు తరువాత ఆమె అప్పటి సంగతిని పూసగుచ్చినట్లు చెప్పింది.

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా మన మనసుల్లో రాజరికం అరాచకం పోదు. అలా మన మనసుల్లో ప్రిన్స్ గా కొలువైన మహేష్ బాబు పాన్ బహార్ ప్రకటనలో నటించాడు.

Mahesh Babu endorsing pan bahar ad

ఇప్పుడు ఏ పేపర్ తిరగేసినా, ఏ టీ వీ ఆన్ చేసినా విజయానికి గుర్తుగా ప్రిన్స్ మహేష్ రాచ ఠీవితో రోల్స్ రాయిస్ కారు ఎక్కుతూ, దిగుతూ, హిలిక్యాపిటర్ దిగి…స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తూ…బ్యాగ్ విసురుతూ…పాన్ బహార్ తినండి అని మనల్ను రెచ్చగొడుతున్నాడు. టెంప్ట్ చేస్తున్నాడు. ప్రాధేయపడుతున్నాడు. ఆదేశిస్తున్నాడు. పక్కన ఇంకో ఉత్తర భారతానికి మార్కెటింగ్ బిస్కట్ కోసం హిందీ నటుడు కూడా పాన్ బహార్ తింటున్నాడు.

పాన్ బహార్ చ్యవనప్రాశ్య్ కాదు. పాన్ బహార్ పోషకాహారం కాదు. అది పేరుకు మౌత్ ఫ్రెషనర్. యాలకుల వాసనతో నోరు ఘుమ ఘుమలాడుతుందని చెప్పుకుంటారు కానీ…తంబాకు, పొగాకు మిశ్రమాలతో చేసిన నోటి క్యాన్సర్ కు కారణమయ్యే ఒకానొక పదార్థం. సిగరెట్టును కాల్చి పొగ పీల్చాలి. దీన్ని నోట్లో వేసుకుని నమలాలి.ప్రిన్స్ పరవశించి చెబుతున్న పాన్ బహార్ లో నిషేధిత మెగ్నీషియం కార్బోనేట్ ఉందని మీడియాలో లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. వస్తున్నాయి. రుజువులు కావాల్సినవారు ప్రిన్స్ తో పాటు రోల్స్ రాయిస్ లో తార్నాక సెంటర్ ఫార్ సెల్యులార్ మాలిక్యులర్ బయలాజి – సీ సీ ఎం బి ల్యాబ్ కు వెళ్లి ఒక డబ్బా పాన్ బహార్ ఇచ్చి…దగ్గరుండి మెగ్నీషియం కార్బొనేట్ ను వేరు చేసి చూసుకోవచ్చు.

మహేష్ బాబుకు పాన్ బహార్ లో మెగ్నీషియం కార్బోనేట్ సంగతి తెలియకపోవచ్చు. తెలిసి ఉండవచ్చు. ఆయన ఏ ప్రకటనలో నటించాలి? ఎందులో నటించకూడదు? అని చెప్పే అధికారం మనకు ఉండదు. మనం మౌన ప్రేక్షకులం.

అయితే- ఇది సోషల్ మీడియా యుగం. మహేష్ బాబు పాన్ బహార్ ప్రకటనలో నటించడం మీద డిజిటల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఊరిని బాగుచేయడానికి అమెరికా నుండి విమానమెక్కి వచ్చేసే మహర్షి నోటిని బాగుచేయడానికి పాన్ బహార్ ఇస్తున్నాడా?

వేల కోట్ల ఆస్తిని వదిలి సైకిలెక్కి పల్లెల్లో కలుపు తీయడానికి వెళ్లిన శ్రీమంతుడు నోట్లో కలుపు తీసుకోండని మన మీదికి పాన్ బహార్ డబ్బా విసురుతున్నాడా?

పాన్ బహార్ అన్నది నోటికి హానికరం కానే కాదు; అత్యంత ఆరోగ్యకరం అని మహేష్ బాబు…భరతనే నేను హామీ ఇస్తున్నాను…బాధ్యుడినయి ఉంటాను…అని అదే పాట పాడగలడా?

“విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరుగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నై ఉంటాను
Of the people, for the people, by the people ప్రతినిధిగా
This is me, this is me”

ఇది ఆయన పాడి, ప్రమాణం చేసి ఇచ్చిన హామీ.

సినిమా హామీకి విలువ లేనే లేదంటారు. అంతేగా?

ఎక్కడ సాయి పల్లవి?
ఎక్కడ రొనాల్డో?
ఎక్కడ మహేష్ బాబు?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: హీరోను పొగడలేక మూగబోతున్న భాష

Also Read: భజన చేసే విధము తెలియండి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్