Saturday, September 21, 2024
HomeTrending Newsబిజెపి రైతు వ్యతిరేకి - మంత్రి సత్యవతి

బిజెపి రైతు వ్యతిరేకి – మంత్రి సత్యవతి

దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బందిపెడుతూ రాజకీయం చేస్తున్నారని బిజెపి నేతలపై గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, ఎముకలు కొరికే చలిలో రైతులను ఏడాది పాటు ఇబ్బంది పెట్టిన దేశ ప్రధానినే పంజాబ్ లో రైతులు రోడ్డు మీద నిలబెట్టారని, మిగిలిన బిజెపి నేతలకు కూడా ఇదే గతి పడుతుందని మంత్రి హెచ్చరించారు. బిజెపి నేతలు నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే వారికి పుట్టగతులు ఉండవన్నారు.

రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి 50వేల కోట్ల రూపాయలను జమ చేసిన సందర్భంగా మహబూబాబాద్ లోని రైతు వేదికలో ఈ రోజు సంబరాలు నిర్వహించారు. అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు సంబరాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

బిజెపి నేతలు కొత్త బిచ్చగాళ్ల వలె రాష్ట్రంలో పర్యటిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, తమ రాష్ట్రంలో గెలువని నేతలు ఇక్కడ వచ్చి కోతలు కోస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎకరం నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతులు 90 శాతం ఉంటే, అంతకు మించిన భూమి ఉన్నవారు పది శాతం మాత్రమే ఉన్నారన్నారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా రైతేనని, అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలని రైతుబంధు అందరికీ ఇస్తున్నారని, దీనిని అర్థం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.

బిజెపి ప్రభుత్వం తెలంగాణ పథకాలను ప్రశంసిస్తూ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర బిజెపి నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొలవరానికి నిధులు ఇస్తూ మూడేళ్లలో నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే అతీ, గతి లేదన్నారు. కనీసం రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు విజ్ణులని, ఇక్కడ లాభాసాటి వ్యవసాయం కోసం పంటి మార్పిడి చేస్తున్నారని, ఇక్కడి రైతులను రెచ్చగొడితే ప్రధానికి పట్టిన గతే మీకు పడుతుందన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ జేడీ చత్రు నాయక్, పాక్స్ చైర్మన్ రంజిత్, కో ఆప్షన్ సభ్యులు పాషా, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : అంగన్వాడీలకు అరుదైన గౌరవం

RELATED ARTICLES

Most Popular

న్యూస్