బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని నిర్మల్ రాకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామికమని బిజెపి నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ మండిపడ్డారు. బైంసా సభకు ముందుగా అనుమతి ఇచ్చి అకస్మాత్తుగా రద్దు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించారు. సోమవారం బహిరంగ సభ ఉంటే ఇప్పుడు ఆపుతారా? సభా వేదిక వేసేదాక చూసి, మహారాష్ట్ర సీఎం దిగే హెలీప్యాడ్ ను కూడా పరిశీలించిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉందని విమర్శించారు.
బీజేపీని చూసి కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ప్రజాస్వామ్యయుతంగా జరిగే సభను అడ్డకోవాలనుకుంటున్నారని సోయం బాపురావ్ ఆరోపించారు. 4 విడత ప్రజాసంగ్రామ యాత్ర కేసీఆర్ ను ఫామ్ హౌజ్ నుంచి బయటకు లాక్కొచ్చిందని, 5 వ విడత ప్రజాసంగ్రామ యాత్ర కేసీఆర్ పునాదులు కడుపుతుందన్న భయంతో యాత్రకు అనుమతి నిరాకరించారన్నారు. న్యాయస్థానం తలుపు తడతాం. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తామని సోయం బాపురావ్ స్పష్టం చేశారు.