Living Longer like Blue Zones People
“అమ్మ కడుపు చల్లగా – అత్త కడుపు చల్లగా – బతకరా బతకరా పచ్చగా- నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా”
ఎన్నాళ్ళు బతకాలి? వెయ్యేళ్ళు కాకున్నా వందేళ్ళన్నా హాయిగా ఆనందంగా జీవించగలమా! కాకిలా కలకాలం బతికేకన్నా హంసలా కొన్నాళ్లే బతికినా చాలు అనేది పాత సామెత. హంసలా నూరేళ్లూ బతకడం సాధ్యమే అనేది నేటి మాట.
ఎలాగోలా వందేళ్లు బతకడం కాదు. హాయిగా, ఆనందంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండటం ముఖ్యం.
అయితే ఇందుకు కొన్ని పద్ధతులుంటాయంటున్నారు నిపుణులు. ప్రపంచంలో అటువంటి వారున్న ప్రాంతాలను బ్లూ జోన్ అంటున్నారు. సాధారణంగా పదివేల మందిలో ఇద్దరు శతాధికులు ఉంటే ఎక్కువ. ఈ బ్లూ జోన్ ప్రాంతాల్లో ఎక్కువమంది ఏళ్ళు పైబడినా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు.
గ్రీస్, జపాన్, సార్దీనియా, కోస్టారికా, కాలిఫ్ ప్రాంతాలు ఈ బ్లూ జోన్ కిందికి వస్తాయి. ఆయా ప్రాంతాలు, నేపథ్యాలు, పద్ధతులు వేరైనా అందరిలో కనిపించే పోలిక జీవనశైలి. అదేంటో చూసేద్దాం
Blue Zones Living :
⁃ నడక నా తల్లి పరుగు నా తండ్రి అన్నారో కవి. అది ఒంటపట్టించుకున్నారో ఏంటో బ్లూ జోన్ లో ఉండేవారు ఎక్కువగా నడుస్తూ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. వయసయిపోయిందనుకుంటూ ఊరికే కూర్చుండి పోకుండా కదులుతూ ఉండాలన్నమాట
⁃ ఎప్పటికప్పుడు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ వాటికోసం ప్రయత్నించాలి. ఇంకేం చేస్తాంలే అనుకోకూడదు.
⁃ పిల్లలు దగ్గర లేరనో, సరిగా చూడటం లేదనో బాధపడుతూ ఒత్తిడికి గురవుతూ మరింత అనారోగ్యం తెచ్చుకోకూడదు. వీలయినంత సంతోషంగా ఉండాలి
⁃ పెద్దవారయ్యేకొద్దీ తినడం తగ్గుతుంది. అలా అని మాడ్చుకోకూడదు. దొరికినపుడు ఎక్కువా తినెయ్యకూడదు. కడుపులో ఇంకా ఖాళీ ఉండగానే తినడం ఆపెయ్యాలి
⁃ బ్లూ జోన్స్ లో శతాధికులు ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు తీసుకుంటారు. చిక్కుళ్లు ఎక్కువగా తింటారు.
⁃ అప్పుడప్పుడు వైన్ తీసుకుంటూ ఉంటే మనసు, శరీరం కొత్త ఉత్తేజం పొందుతాయి. అలా అని తాగుతూ కూర్చోకుండా మితంగా తీసుకోవాలి సుమా !
⁃ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడమూ ఆనందమయ జీవితానికి కారణమే. భక్తి కలిగి ఉండటం, గుడి/మసీదు/చర్చి కెళ్ళడం, సంబంధిత గ్రంథాలు చదవడం మంచిదే
⁃ ఉమ్మడి కుటుంబాలనుంచి ఒంటరి కుటుంబాలు పెరుగుతున్నవేళ బ్లూ జోన్ వాసులు అన్ని తరాల వారితో కలసి మెలసి ఉంటున్నారు. ఇదీ వారి దీర్ఘాయుష్షుకు కారణమే.
⁃ బ్రతికిన నాడు బాసటగా, పోయిననాడు ఊరటగా అభిమానం, అనురాగం చాటే ఆ నలుగురూ మరెవరో కాదు,బంధుమిత్రులు. ఎప్పుడూ మంచి స్నేహితులుండేలా చక్కని స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి.
⁃ ఇవీ బ్లూ జోన్ మిత్రులు చెప్తున్న సూత్రాలు. ఆ జాబితాలో మనమూ చేరాలంటే వారి లాగే మంచి అలవాట్లు చేసుకుంటే మంచిదేగా!
-కె. శోభ
Read More: సుఖ నిద్రకు చిట్కాలు
Read More: రాశి తగ్గి వాసి పెరిగిన పెళ్లిళ్లు