Saturday, January 18, 2025
Homeసినిమా‘హరి హర వీర మల్లు’లో బాబీ డియోల్

‘హరి హర వీర మల్లు’లో బాబీ డియోల్

భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎంతో ప్రతిభ గల క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. జీన్స్, ప్రేమికుల రోజు, భారతీయుడు వంటి హద్దులు చెరిపేసే భారీ చిత్రాలతో గొప్ప అనుభవం సంపాదించిన ఎ.ఎం. రత్నం.. ఇప్పుడు కూడా అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది.

ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.

హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ను ముగించారు. ఆ షూట్‌కు ముందు ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణులతో ప్రత్యేక ప్రీ-షెడ్యూల్ వర్క్‌షాప్ నిర్వహించారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆలోచనకు జీవం పోయడానికి.. తోట తరణి మొఘల్ యుగాన్ని పునఃసృష్టి చేయడానికి  అన్ని విధాలా శ్రమిస్తున్నారు.

ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి వెండితెరపై గొప్ప అనుభూతిని పంచాలన్న ఉద్దేశంతో చిత్రం బృందం ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కొన్ని వారాల క్రితం విడుదలైన హరి హర వీర మల్లు గ్లింప్స్ కి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్