Sunday, January 19, 2025
Homeసినిమాస్టేజ్ పై ఏడ్చేసిన నందూ .. ధైర్యం చెప్పిన నాగశౌర్య!  

స్టేజ్ పై ఏడ్చేసిన నందూ .. ధైర్యం చెప్పిన నాగశౌర్య!  

నందూ – రష్మీ జంటగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ సినిమా రూపొందింది. ప్రవీణ్ పగడాల నిర్మించిన ఈ సినిమాకి రాజ్ విరాట్ దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిన్న రాత్రి హైదరాబాద్ – మాదాపూర్ లోని ‘వి’ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ వేడుకకి నాగశౌర్య ముఖ్య అతిథిగా వచ్చాడు. సత్యం రాజేశ్ .. సుడిగాలి సుధీర్ .. ధన్ రాజ్ టీమ్ అంతా కూడా నందూతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ సినిమాను గురించి నందూ మాట్లాడుతూ .. అవకాశాల కోసం తాను చాలామందిని కలిశాననీ, కానీ తనకి ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ధైర్యం చేయలేదని అన్నాడు. కథ పట్టుకుని తిరిగితే మరో హీరో కోసం అడిగారనీ .. అలాంటి పరిస్థితుల్లో తానే నిర్మాతగానూ మారానని చెప్పాడు. అయితే బడ్జెట్ తన పరిధి దాటిపోతున్న సమయంలో ప్రవీణ్ పగడాల రంగంలోకి వచ్చారని అన్నాడు. ఈ సినిమా కోసం రష్మీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేసిందనీ, ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడిందనీ .. ఆమె వేరే లెవెల్ అంటూ అభినందించాడు. తన సినిమా ద్వారా చాలామంది కొత్తవాళ్లను పరిచయం చేసే అవకాశం లభించిందని అన్నాడు.

నాగశౌర్య మాట్లాడుతూ .. ఈ సినిమా కోసం టీమ్ పడిన కష్టాలను తాను విన్నాననీ, నందూ పడిన కష్టం తప్పకుండా ఫలిస్తుందని అన్నాడు. దాంతో నందూ ఒక్కసారిగా స్టేజ్ పైనే ఏడ్చేశాడు. వెంటనే అతణ్ణి ఆప్యాయంగా శౌర్య హగ్ చేసుకున్నాడు. బాధపడవలసిన పనిలేదనీ, తన సినిమాకి చీఫ్ గెస్టుగా వచ్చే రేంజ్ కి అతను ఎదుగుతాడంటూ ధైర్యం చెప్పాడు. ఒకే ఒక్క మెసేజ్ తో తన సినిమా ఫంక్షన్ వచ్చిన శౌర్యకి నందూ కృతజ్ఞతలు తెలియజేశాడు. నిజానికి ప్రతి సినిమా వెనుక కష్టాలు ఉంటాయి. కానీ ఆడియన్స్ కి కావాల్సింది కంటెంట్ మాత్రమే. ఆ కంటెంట్ ఉంటే సక్సెస్ నుంచి నందూ కూడా తప్పించుకోలేడనేది నిజం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్