Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

నా దగ్గర రెండు వ్రాతప్రతులున్నాయి.
అవి, ఒకటి – మూడు వందల యాభై ఏళ్ళ మద్రాసు చరిత్ర! మరొకటి – శ్రీమతి బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారి గురించి.
నాకంటూ ఉన్న పుస్తకాల ఆస్తిపాస్తులలో తాజాగా సంపొదించుకున్న
ఈ రెండు ప్రతులూ అమూల్యమైనవీ! అపూర్వమైనవి!!

ఈ రెండు ప్రతుల రచయిత – గోవిందరాజు వెంకట రామారావుగారు. ఈయన మరెవరో కాదు. అనేక గీతాలతో తెలుగువారి అభిమాన రచయితగా వినుతికెక్కిన
బసవరాజు అప్పారావుగారి బావమరిది. రాజ్యలక్ష్మమ్మగారి సోదరుడు.

2007లో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కుటుంబసభ్యులలో ఒకరైన సీతరామంగారికి (మద్రాసు) పోస్టులో పంపిన వ్రాతప్రతులివి. అక్కడి నుంచి వీటిని మల్లాదివారి మేనల్లుడు రాజర్షి (నేను బద్రీ అనే పిలుస్తాను) మా ఆనందన్నయ్యకు పంపితే నేను వాడి దగ్గర నుంచి తీసుకొని చదివాను. రెండూ ఆసక్తికరమైన అంశాలతో కూడిన ప్రతులే.

సీతారామంగారికి రాసిన ఉత్తరంలో మద్రాసును గురించి మద్రాసులోనే ఉంటున్న మీకు చెప్పటమేమిటని అనుకోవచ్చంటూనే మద్రాసు చరిత్రను ఓ యాభై పేజీలలో పంపారు.

నేను మద్రాసులోనే పుట్టి పెరిగాను. మద్రాసు గురించి తమిళంలో ఇటీవల ఒకటి రెండు పుస్తకాలు చదివాను. అయితే రామారావుగారు చెప్పిన విషయాలలో ఒకటి రెండు తప్ప చాలా వరకూ నాకు తెలియనివే. 19వ శతాబ్దం వరకూ మద్రాసులో పౌర ప్రముఖులంతా తెలుగువారేనని, తెలుగు వర్తకులే దీనిని వృద్ధి చేశారనీ, రైళ్ళు వచ్చాక తమిళులు అధిక సంఖ్యలో వచ్చి మద్రాసు తమిళనగరమని వాదించటం, తెలుగు నగరమని ప్రకాశంగారు రుజువు చేయట‌ం, 3 కమిటీలు భారత ప్రభుత్వంకేసి పరిష్కారమార్గం కనుక్కుని నివేదిక సమర్పించమనటం, వాళ్ళ సూచనలు మద్రాసు ఆంధ్రులూ తమిళులూ కూడా నిరాకరించటం, జెవిపి కమిటీ కూడా ఇక లాభం లేదని పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష బలిదానం కూడా సాధించలేకపోవటం – చివరకు నెహ్రూ మాట విని పదవీ వ్యామోహం గల ఆంధ్ర నాయకులు అంగీకరించి కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రావతరణం…ఇలా ఉత్తరం రాసిన రామారావుగారు పలు విషయాలు ప్రస్తావించడంతోపాటు వాటికి సంబంధించిన చిత్రాలను సందర్భానుసారం అతికించటం వల్ల ఈ లిఖితప్రతి బలేగా అన్పించింది నాకు. ఇందులోని ప్రతి విషయమూ కొత్తగా అన్పించింది చదువుతుంటే.

ఇక రెండో పుస్తకానికొస్తే బసవరాజు అప్పారావుగారి సతీమణి బసవరాజు రాజ్యలక్ష్మమ్మగారి స్మృత్యర్థం రామారావుగారు రాసిన విషయాలు. మొదటి పుస్తకంలాగే ఇందులోనూ ఫోటోలతోనూ రసవత్తరమైన విషయాలతోనూ చదువుతుంటే ఇంకా మరిన్ని జ్ఞాపకాలు రాసి ఉంటే బాగుండేదనిపించింది. రాజ్యలక్ష్మమ్మగారు స్వాతంత్ర్య సమరయోధురాలు. గాంధేయవాది.కవయిత్రి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి విశిష్ట రచయిత్రి పురస్కారగ్రహీతంటూ రామారావుగారు తమ అక్కయ్య గురించి చెప్పిన విషయాలన్నీ ఎంత ముచ్చటగా ఉన్నాయో చెప్పలేను మాటల్లో.

అప్పారావుగారి విద్యాభ్యాసం, అప్పారావుగారి మద్రాసు కాపురం, అప్పారావుగారి తండ్రి దీర్ఘకాలిక రుగ్మత, అప్పారావు అకాలమరణం, మహాత్ముని మహిళాశ్రమంలో రాజ్యలక్ష్మమ్మ శిక్షణ, బందరులో ఖాదీ శిక్షణ శిబిరంలో ఆవిడ రెండు నెలలుండటం, మద్రాసులోని గుజరాతీ మండలిలో హిందీ అధ్యాపకురాలిగా కొనసాగటం, ఇంటి దగ్గరే హిందీ ప్రచారం ఇలా వివిధ ముఖ్య ఘట్టాలను ప్రస్తావిస్తూ రామారావుగారు సాగించిన రచన చదువుతుంటే కళ్ళముందు కనిపిస్తారు రాజ్యలక్ష్మమ్మగారు. ఈ వ్రాతప్రతిలోని ఛాయాచిత్రాలన్నీ ఎంతో అపురూపమైనవి.

రాజ్యలక్ష్మమ్మగారి అస్తమయమప్పుడు ప్రముఖుల సంతాపసందేశాలను సైతం రామారావుగారి స్వదస్తూరిలో చదివాను.

ఇక గాంధీజీ వద్ద నా శిష్యరికం అంటూ రాజ్యలక్ష్మమ్మగారు రాసి ప్రచురితమైన వ్యాసాన్ని కూడా ఈ పుస్తకంలో జత చేశారు.

ఈ రెండు ప్రతుల రచయిత గోవిందరాజు వెంకటరామారావుగారి గురించి ఓ రెండు మాటలు…

1913లో విజయవాడ దగ్గర పటమటలో జన్మించిన రామారావుగారు గాంధేయవాది.స్వాతంత్ర్య సమరయోధులు.చారిత్ర్యాదిక విషయ పరిశోధకులు. 2009లో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో కాలధర్మం చెందారు.

– యామిజాల జగదీశ్

Also Read : మద్రాసు నగరంలో యువస్వరాలు 

1 thought on “రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !

  1. ఆ రెండు అపురూపమైన పుస్తకాలు చదవడం ఎలా, ఏదైనా లింక్ ద్వారా చదవగలమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com