Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపోరాడితే పోయేదేమీ లేదు...

పోరాడితే పోయేదేమీ లేదు…

ఇది కదా చదవి పొంగిపోవాల్సిన వార్త!
ఇది కదా చూసి అభినందించాల్సిన వార్త!
ఇది కదా పదిమందికి షేర్ చేయాల్సిన వార్త!

ఇంట్లో ఈగలకు, దోమలకు, నల్లులకు, బల్లులకు;
వీధిలో పిల్లులకు, కుక్కలకు నిలువెల్లా వణికిపోయే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వార్త ఇది.

హైదరాబాద్ బేగంపేట అంటే నగరం నడి బొడ్డు. మధ్యాహ్నం ఒకటిన్నర అంటే పట్ట పగలు. గుమ్మం ముందు ఇద్దరు యువకులు తుపాకీ పట్టుకుని…ఏయ్! కదిలారో కాల్చేస్తాం. మర్యాదగా డబ్బు, నగలు ఇచ్చి…ప్రాణాలు దక్కించుకోండి! ఖబడ్దార్! అని బెదిరించి గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టారనుకోండి. మనమైతే ముందు వణికి, స్పృహదప్పి పడిపోతాం. పొరపాటున మనలో ధైర్యం ఇంగువ కట్టిన అవశేష వస్త్రంగా ఏ మూలనో మిగిలి ఉన్నా…నోట మాట రాదు. కాలు చేయి ఆడదు. పై ప్రాణాలు పైనే పోయి ఉంటాయి.

కానీ బేగంపేటలో తల్లి అమిత్ మహోత్, ఆమె కూతురు మనలా నీరుకారిపోలేదు. క్యాబే! అని సివంగుల్లా దొంగల మీదికి ఎగబడ్డారు. దొంగలతో తలపడ్డారు. పెనుగులాడారు. ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురెళ్లి మీద పడి లాక్కున్నారు. ఆ తుపాకీతోనే ఒకడికి దేహశుద్ధి చేశారు. ఒకడిని ఒడుపుగా ఇంట్లో బంధించారు. ఓవరాక్షన్ చేస్తే ఆ తుపాకీతోనే చంపేసేలా ఉన్నారని ప్రాణభయంతో ఒకడు గేటు దాకా పెనుగులాడి…జారుకుని…పరుగు పెట్టాడు.(తరువాత ఖాజీపేటలో పోలీసులకు పట్టుబడ్డాడు).

ఈలోపు చుట్టుపక్కలవారు వచ్చి ఇంట్లో ఉన్న దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వార్తగా చదివితే ఆ తల్లీ, కూతుళ్ల తెగింపు, పోరాట పటిమ, ఒకరిని మించి ఒకరు మీద పడి దొంగ ఆటకట్టించిన తీరు, సెకెనులో వెయ్యో వంతులో స్పందించిన వారి వేగం సరిగ్గా అర్థం కావచ్చు. కాకపోవచ్చు.
ఆ తల్లి, ఆ తల్లికి తగినట్లు పదహారేళ్లు కూడా దాటని కూతురు గుమ్మంలో దొంగతో కలియబడ్డ వీడియో సీ సీ టీ వీ లో రికార్డ్ అయి ఉంది. ఒకసారి ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. సోషల్ మీడియాలో వైరల్ అయి తిరుగుతోంది.

https://x.com/idhatri2/status/1771093271315378566?t=fCelbdgWyQ5mZ5HBAsVWhg&s=09

మన ఇళ్లల్లో కూడా అమిత్ మహోత్ తల్లే ఉంది. ఆ తల్లి కూతుళ్లే ఉన్నారు. వంటింటి కుందేళ్లని, అబలలని మనమే వారిలో అమిత పరాక్రమాలను, తెగింపును కట్టి పడేశాము. ఒకసారి ఆ కట్లు విప్పి చూడండి! ఎందరో మహోత్ ల మహోన్నతమైన తెగువను లోకం చూడగలుగుతుంది.

ఇలాంటప్పుడు కళ్ళల్లో, మాటలో, బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడా బెరుకు ఉండకపోవడమే సగం గెలుపు. తెగబడి ఎగబడితే ఊపిరే ఆయుధం; ఉక్కు పిడికిలే ఏ కె ఫార్టీ సెవెన్; మనకు మనమే ఒంటరి సైన్యం- అన్నదే మహోత్ తల్లి నుండి, తల్లికి తగ్గ ఆ తనయనుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం. అందిపుచ్చుకోవాల్సిన ధైర్యం.

ఎవరికైనా ఈరోజు చస్తే రేపటికి రెండో రోజే. బతికి ఉన్నప్పుడు బతుకును బతికించుకునే తెగువ ఉన్నవారి ముందు చావు సిగ్గుతో తలదించుకుని…వారికి దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది.

“దేహముంది;
ప్రాణముంది;
నెత్తురుంది;
సత్తువుంది;
ఇంతకన్న సైన్యముండునా?”
-సిరివెన్నెల

(పదిమందికి ధైర్యం నూరిపోసేలా ఈ వార్త మీద నాలుగు ముక్కలు రాయాల్సిందిగా ప్రేమగా ఆదేశించిన పాఠకులకు నమస్సులతో…)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్