Thursday, May 30, 2024
HomeTrending Newsఅభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు...నేతల్లో ఆందోళన

అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు…నేతల్లో ఆందోళన

బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రాం రెడ్డిలు పోటీ చేయనున్నారు.

తెలంగాణలో మూడో దఫా జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు కారు గుర్తుకు కంగారు పుట్టిస్తున్నాయి. అపర చాణిక్యుడిగా పేరున్న కెసిఆర్ అభ్యర్థుల ఎంపికలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొంత మంది అభ్యర్థులు పరవాలేదు అనుకుంటే… మరికొంతమంది అభ్యర్థుల ఎంపిక తీరు చూసి పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఓటమితే నిర్వేదంలో ఉన్న క్యాడర్… కెసిఆర్ మార్క్ రాజకీయం, ఎంపి అభ్యర్థులను చూసి బెంబేలెత్తుతోంది.  మెదక్ సీటుకు ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి పేరు ప్రకటించటంతో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది.

జిల్లాలో ఉన్నతాధికారి హోదాలో వెంకట్రామి రెడ్డి కేవలం అస్మదీయులకే పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎర్రవెల్లిలో మొదట ప్రారంభమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు వ్యవహారంలో ఈయన వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారి తీసింది. స్థలం ఇచ్చిన వారికి ఇల్లు దక్కలేదు… హైదరాబాద్లో ఉండేవారికి ఇక్కడ ఇల్లు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రజలతో నేరుగా సంబందాలు లేని నేతకు టికెట్ ఇస్తే గెలవటం అంత సులువు కాదని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కారు కంచుకోటగా ఉన్న మెదక్ లో ఈ దఫా ఏం జరుగుతుందో అంటున్నారు.

మరోవైపు ఎంపి సీటు మీద ఆశాపెట్టుకున్న పార్టీ సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెలుతున్నారని ప్రచారం జరుగుతోంది. విషయం తెలిసిన అధినేత కెసిఆర్ వంటేరు ప్రతాప్ రెడ్డిని బుజ్జగిస్తున్నారని సమాచారం.

అభ్యర్థి ఎంపిక వెనుక అసలు కథ వేరే ఉందట. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసమే బలహీనమైన అభ్యర్థిని ఎంపిక చేశారని గులాబీ నేతలు గుసగుసలు పెడుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినపుడు కూడా ఉపఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని బరిలో దించారని నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ కు స్థానిక బీఆర్ఎస్ నేతల సహకారం మీదనే గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటం… అదే వర్గం నేత ప్రవీణ్ కుమార్ పోటీకి దిగటం.. కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా.  అయితే బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపి రాములు కుమారుడు భరత్ రూపంలో ఆర్ఎస్ కు ముప్పు పొంచి ఉంది. భరత్ మాదిగ కావటంతో ఓట్లు చీలి కాంగ్రెస్ గెలుపు సునాయాసం అవుతుందని విశ్లేషణలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్