Polavaram: ఒరిజినల్ డిజైన్ ప్రకారమే పోలవరం కడుతున్నామని, ఇప్పుడు కొత్తగా ఎత్తు పెంచలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం, సిడబ్ల్యూసీ సూచనల ప్రకారమే తాము ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. వందేళ్ళ తర్వాత ఇంత పెద్దఎత్తున గోదావరికి వరద వచ్చిదన్నారు. భద్రాచలం వరదలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. అలా మాట్లాడితే హైదరాబాద్ వదులుకోవడం వల్ల ఏపీకి వచ్చే ఆదాయం తగ్గిపోయిందని, అలా అని హైదరాబాద్ మళ్ళీ పూర్వం లాగా ఉంచుదామని అడిగితే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలపమనండి అంటూ బొత్స వ్యాఖ్యానించారు. అవివేకంగా, పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని హితవు పలికారు. పువ్వాడ అజయ్.. ముందు తన సంగతి తాను చూసుకోవాలని, ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వం చూసుకుంటుందని బొత్స అన్నారు.
ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి తప్ప ఇలా మాట్లాడవద్దన్నారు. సమస్య ఎక్కడైనా సమస్యేనని, ప్రజలు ఎక్కడైనా ప్రజలేనని, అందుకే నేతలు బాధ్యతగా మాట్లాడాలని, రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని సూచించారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకుంటామన్న తెలంగాణా సిఎం కేసిఆర్ వ్యాఖ్యలను బొత్స స్వాగతించారు.
పోలవరం ముంపు మండలాలను తెలంగాణకు ఇవ్వాలని టిఆర్ఎస్ ఎంపీలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేస్తే, తాము కూడా రాష్ట్రాన్ని మళ్ళీ కలపాలన్న డిమాండ్ తెస్తామని చెప్పారు.
Also Read : పోలవరంతో భద్రాచలానికి ముప్పు – మంత్రి పువ్వాడ