Friday, March 29, 2024
HomeTrending Newsనమ్మకం లేదనడం సరికాదు: బొత్స

నమ్మకం లేదనడం సరికాదు: బొత్స

Let’s discuss: తమ ప్రభుత్వం ఎవరి పట్లా కక్ష పూరితంగా వ్యవహరించబోదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాము వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నామని, ఉద్యోగ సంఘాలతో మాట్లాడటానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని బొత్స అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల కమిటీ నియమించారన్నారు. అయితే ఉద్యోగులు చేసే డిమాండ్లు సమంజసంగా, చట్టబద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర పరిస్థితులను అర్ధం చేసుకోవాలని, ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదనడం సరికాదని,  తొందరపడి మాట్లాడొద్దని బొత్స సూచించారు.

నేడు కూడా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రాలేదని, మూడురోజులుగా వారి కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని ఉద్యోగులు అంటున్నారని, వారి ఆలోచన ప్రకారమే జీతాలు విడుదల చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు వచ్చి వారి ఆలోచనా విధానం ఏమిటో చెబితే దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అసలు చర్చలకే రాబోమని వారు అనడం సరికాదన్నారు. ఉద్యోగులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే దానికి అనుగుణంగా చర్యలు తప్పవన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను తమ పార్టీ ఎంపీలు లేవనెత్తుతారని బొత్స వివరించారు.

తెలుగుదేశం పార్టీ నారీ సంకల్ప దీక్షపై బొత్స సెటైర్లు వేశారు. ఆ పార్టీకి టైం బాగా లేదని ఓ పక్క దీక్ష పెట్టారని, మరో పక్క ఆ పార్టీ నేత అత్యాచారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో నిందితుడిని శిక్షించే విషయంలో చట్టం తన పని తాను చేసుకువెళుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్