రామతీర్థం దేవాలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామస్వామీ దేవస్థానంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో బొత్స పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలోని ఒంటిమిట్ట, రామతీర్థం ఆలయాల్లో ప్రభుత్వం తరఫున అధికారికంగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నవమి రోజున అభిజిత్ లగ్నంలో రామతీర్ధంలో స్వామివారి కల్యాణం జరుగుతుంది. నవమి నుంచి ఏదోరోజున ఒంటిమిట్టలో రాత్రిపూట లగ్నానికి సీతారామ కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది సిఎం జగన్ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
నేడు రామతీర్థంలో జరిగి శ్రీరామ నవమి వేడుకల్లో విజయనగరం ఎంపి బెల్లాన చంద్ర శేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.