అసెంబ్లీలో చట్టం చేసిన రోజే మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనిపై టిడిపి లాంటి దృష్టశక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయని, అయినా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ విధాన స్పష్టంగా ఉందన్నారు.
అమరరాజా కంపెనీ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, తప్పు చేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారని బొత్స అభిప్రాయపడ్డారు. ఆ కంపెనీ ఇక్కడినుంచి వెళ్లిపోవాలని మేము కోరుకోవడం లేదని వెల్లడించారు. వ్యాపారస్తుడికి ఎక్కడ లాభం ఉంటే అక్కడకు వెళతారని వ్యాఖ్యానించారు. దీనిపై పత్రికలో వచ్చిన దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు బొత్స.
జల వివాదం విషయంలో తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నామని, అన్నదమ్ముల్లా ఉండాలని మా అభిమతమని, తగవు పడాలన్న ఆలోచన తమకు లేదని బొత్స తేల్చి చెప్పారు. ఆంధ్రా ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని కేసీఆర్ ఇది వరకు చెప్పారని, అలా అన్నారో లేదో ఆయనే చెప్పాలని సూచించారు. విశాఖ స్టీల్ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రైవేటీకరణ అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బొత్స వివరించారు.