Sunday, January 19, 2025
HomeTrending Newsకర్నాటక ఫలితాలతో ఏం సంబంధం?: బొత్స

కర్నాటక ఫలితాలతో ఏం సంబంధం?: బొత్స

అమరావతిలో ఇళ్ళ స్థలాల పంపిణీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ తీర్పు ద్వారా పట్టాల పంపిణీకి మార్గం సుగమమైందన్నారు. ఎవరికైనా… ఎక్కడైనా బతికే హక్కు ఉందని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని, దానిపై ఎక్కువగా మాట్లాడడం సరికాదన్నారు. ఇక్కడ నివసించబోయే  పేదవారి జీవనోపాధికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు ఇళ్ళు ద్వారా పెద్ద పెద్ద కాలనీలు నిర్మిస్తున్నామని, ఆయా కాలనీల్లో నివసించే వారు తమ జీవనోపాధి కోసం వివిధ వృత్తులు చేస్తారని, అదే కోవలో రాజధాని ప్రాంతంలో పేదలు కూడా చేస్తారని చెప్పారు. వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విజయవాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.

తాము అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని ప్రాంతంలో ఇప్పుడు ఇళ్ళపట్టాలు తీసుకున్న వారిని తరిమివేస్తామన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. ‘అధికారంలో ఉన్నప్పుడు ఉండడానికి ఇళ్ళు ఇవ్వరు, వారిని పట్టించుకోరు, ఇప్పుడు తాము పేదల కోసం ఆలోచన చేస్తుంటే ఇలా మాట్లాడడం సరికాద’ని, ఏ రకంగా ఖాళీ చేయిస్తారో రావాలని, అధికారంలోకి వస్తామని పగటి కళలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సమయానికి ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తాయని, ఇది సహజమని, కొత్తేమీ కాదని చెప్పారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతో తమకేం సంబంధమని బొత్స వ్యాఖ్యానించారు. పోలిక, పొంతన ఎక్కడ ఉన్నాయని అడిగారు. కర్ణాటకలో పోటీ పడిన రెండు పార్టీలకూ ఏపీలో ఏదైనా బలం ఉందా అని ఎదురు ప్రశ్నించారు. సిఎం జగన్ పై పవన్ చేసిన ట్వీట్ ను బొత్స తేలిగ్గా తీసుకున్నారు. సెలేబ్రిటీలు వారికున్న అలవాట్లను ఎదుటివారికి ఆపాదిస్తారని, ‘అయన ఒక యాక్టర్, మహా నటుడు, ఆ జిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటా’రన్నారు. ఎన్నికలు రావడం ఖాయమని, షెడ్యూల్ ప్రకారం సాధారణ ఎన్నికలతోపాటే వస్తాయని, దానికే మేం సిద్ధంగా ఉన్నామని, దేశమంతా ముందే వస్తే తాము కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అధికారం లేనివారికి ఎన్నికలపై ఆతృత ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్