బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యాతలు స్వీకరించాక రిషి సునాక్ ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దే పనులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన మేధావులకు తలుపులు బార్లా తెరిచారు. బ్రిటన్ ప్రకటించిన ఈ అవకాశం సహజంగానే చైనా కన్నా భారత్, పాకిస్తాన్ దేశాలకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. భారతీయ మూలాలు కలిగిన రిషి సునాక్ ఈ ఛాన్స్ మొదట ఇండియా కే ఇచ్చారు.
భారత యువ ప్రొఫెషనల్స్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తీపికబురు అందించారు. భారత్ నుంచి బ్రిటన్‌లో పనిచేసేందుకు ఏటా 3000 మంది యువ ప్రొషెషనల్స్‌ను అనుమతించే సరికొత్త వీసా పధకానికి బ్రిటన్ ప్రధాని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గత ఏడాది ఇరు దేశాల మధ్య కుదిరిన వలస భాగస్వామ్య ఒప్పందం స్ఫూర్తితో ఈ తరహా పధకం కింద లబ్ధి పొందిన తొలి వీసా-నేషనల్ దేశంగా భారత్ నిలిచిందని బ్రిటన్ పేర్కొంది.
ఈరోజు బ్రిటన్-భారత్ యువ ప్రొఫెషనల్స్ స్కీమ్ ఖరారైందని, ఈ స్కీమ్‌లో భాగంగా డిగ్రీ చదివిన 18-30 ఏండ్ల లోపు భారత యువ ప్రొఫెషనల్స్ బ్రిటన్‌కు వచ్చి పనిచేస్తూ రెండేండ్ల పాటు ఇక్కడే ఉండవచ్చని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ స్కీమ్ ప్రారంభించడం భారత్‌తో ద్వైపాక్షిక బంధంలో మేలి మలుపని తెలిపింది.
ఇది ఇరు దేశాల ఆర్ధిక వ్యవస్ధల బలోపేతానికి దోహదం చేస్తుందని బ్రిటన్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. బ్రిటన్ నిర్ణయంతో అత్యంత నైపుణ్యం కలిగిన భారత్ యువత ఇప్పుడు ఇంకా పెద్దసంఖ్యలో బ్రిటన్‌లో అవకాశాలు పొందుతారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆకాంక్షించారు. ఇరు దేశాల ఆర్ధిక వ్యవస్ధలూ, సమాజాలు సుసంపన్నమవుతాయని అన్నారు.