వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్ ని భావితరాలకు ఇచ్చే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాల్ని అడ్డుకొని తీరతామన్నారు. తాను విశాఖలో చదువుతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఆందోళనల్ని కళ్లారా చూశానని, అప్పట్లో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. “నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్ డీ విశాఖలోనే చేశాను… ఐఏఎస్ గా సెలక్ట్ అయింది కూడా ఇక్కడి నుంచే… పెద్ద పెద్ద పదవులు సాధించడంలో ఇక్కడ నుంచి ఎంతో నేర్చుకున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెట్టివేయబడిన సంస్థ… ఇక్కడి కార్మికులు కష్టపడి మూడు లక్షల కోట్లను స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని పెంచారు… వీటిని కబ్జా చేయడం కోసమే… బీజేపీ కుట్రలు చేస్తోంది… అదానీకి కట్టబెట్టేందుకు పావుల కదుపుతోంది” అంటూ అయన వ్యాఖ్యలు చేశారు.
మూడు స్పష్టమైన డిమాండ్లు
- ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
- ప్లాంటుకి గనుల కేటాయింపు జరగాలి
- నిర్వాసితుల స్థలాల్ని వెనక్కి ఇచ్చేయండి ….
అంటూ కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నామన్నారు.
ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు శక్తిలకు అప్పగించే కుట్రకి పెట్టిన పేరే డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ అని, అదానీ బొగ్గు దిగుమతులకు స్టీల్ ప్లాంట్ భూములు కావాలని అయన ఆరోపించారు. గంగవరం పోర్టుని అదానీ దిగుమతుల కోసం ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైనా అదే కుతంత్రాన్ని ప్రయోగిస్తున్నారని చంద్ర శేఖర్ మండిపడ్డారు. 5వేల కోట్లు ఇవ్వలేని స్థితిలో కేంద్రం ఉందా అంటూ ప్రశ్నించారు కేంద్ర బడ్జెట్ 45లక్షల కోట్లు అని, దీనిలో ఐదు వేల కోట్లు సాయం చేస్తారా, రుణంఇస్తారా అనేది తేల్చాలని, వడ్డితో సహా స్టీల్ ప్లాంట్ చెల్లిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులే స్టీల్ ప్లాంట్ కు శ్రీరామ రక్ష అని, అందుకే నిర్వాసితులు ఇచ్చిన భూముల్ని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో చేతులెత్తేశాయని, అందుకే కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ వైజాగ్ వస్తామంటే తాము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని ప్లాంట్ ఉద్యోగ సంఘాలు చెప్పినట్లు తోట చంద్రశేఖర్ వివరించారు.