శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకసభ ఎన్నికలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ వరుసగా సమీక్షలు మొదలుపెట్టింది. వివిధ స్థానాల్లో తాజా స్థితిగతులపై చర్చించిన నేతలు పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం వివరిస్తున్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే లోక్ సభ బరిలో కొత్త ముఖాలు రావాలని కార్యకర్తల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అవసరమైతే అగ్రనేతలే రంగంలో ఉండాలని కోరుతున్నారు.
చేవెళ్ళ అభ్యర్థిగా ఎంపి రంజిత్ రెడ్డి ప్రకటించగా బీఆర్ఎస్ మిగతా స్థానాల్లో మార్పులు చేయనుందని సమాచారం. శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్ లకే టికెట్లు ఇచ్చి పరాభవం చవి చూసిన గులాబీ నేతలు లోక్ సభ ఎన్నికల్లో అదే తప్పు చేయకూడదని నిర్ణయించారు. ప్రజల్లో బలం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని…అందుకు భిన్నంగా కుదరదని తెగేసి చెపుతున్నారు.
ఈ లెక్కన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీల్లో చాలామందికి టికెట్లు దక్కపోవచ్చని తెలుస్తోంది. ఖమ్మంలో నామ నాగేశ్వర్ రావుకు టికెట్ ఖాయమని అంటున్నారు. నల్గొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ ఆశిస్తున్నారు. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
నాగర్ కర్నూల్ నుంచి ప్రస్తుత ఎంపి పి రాములుకు ఇవ్వొద్దని నియోజకవర్గంలోని ముఖ్యనేతలు ఏకరువు పెట్టారు. దీంతో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బాలరాజుకు ఇవ్వొచ్చని వినికిడి. అయితే ఇక్కడి నుంచి గోరేటి వెంకన్నను బరిలో నిలిపితే ఎలా ఉంటుందనే కోణంలో గులాబీ నాయకత్వం యోచిస్తోందని తెలిసింది.
మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలు రేసులో ముందు ఉన్నారు. ఎన్నికల నాటికి కొత్తవారిని తీసుకు వస్తారని లేదంటే ఈ ఇద్దరిలో ఒకరి పేరు ఖరారవుతుందని అంటున్నారు.
మిత్రపక్షం MIM తో ఉన్న అవగాహన కారణంగా హైదరాబాద్ లో బలహీనమైన అభ్యర్థిని కారు గుర్తుపై పోటీ చేయిస్తారు. సికింద్రాబాద్ నుంచి గతంలో పోటీ పడిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పోటీ చేస్తారని అంటున్నా.. దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తోంది.
జహిరాబాద్ నుంచి బిబి పాటిల్ ఎంపిగా ఉన్నా ఆయన ఈ దఫా బిజెపి నుంచి బరిలోకి దిగుతారని టాక్ మొదలైంది. మహారాష్ట్ర బిజెపి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న బిబి పాటిల్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వటం అనుమానమే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అత్యవసరమైతే హరీష్ రావు పోటీ చేస్తారని అంటున్నారు. అయితే సిద్ధిపేట వదిలితే మళ్ళీ రావటం కష్టమని ఆయన అనుచరులు లెక్కలు వేస్తున్నారు.
మెదక్ ఎంపి ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పార్టీ అధినేత కెసిఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. శాసనసభలో కేటిఆర్, హరీష్ రావు ఉన్నందున కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని గులాబీ వర్గాలు చెపుతున్నాయి. కెసిఆర్ రాకపోతే గాలి అనిల్ కుమార్, కాంగ్రెస్ నుంచి వచ్చిన తిరుపతి రెడ్డి, మదన్ రెడ్డి తదితరులు ఆశిస్తున్నారు.
నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయకపోవచ్చని తెలిసింది. బిసి నాయకున్ని బరిలో దింపాలని…అవసరమైతే మైనారిటీని తీసుకురావాలని వ్యూహంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
పెద్దపల్లి నుంచి ఎంపి వెంకటేష్ నేత రంగంలోకి దిగుతారని, అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆసక్తి చూపుతున్నారు.
ఆదిలాబాద్ బరిలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోటీ చేయటం ఫైనల్ అయిందని తెలిసింది. శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవటం…ఆదిలాబాద్ బరిలో గెలవాలంటే ఆదివాసీలకు ఇస్తే గెలుపు నల్లేరు మీద నడక అని పార్టీ వర్గాల అంచనా.
కరీంనగర్ నుంచి మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అవసరమైతే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది.
వరంగల్ నుంచి పసునూరి రవీందర్ ను తప్పిస్తారని తెలిసింది. రవీందర్ పార్టీ శ్రేణులతో మమేకం కాలేకపోయారని అపవాదు ఉంది. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ కొత్తవారికి అవకాశం ఇవ్వొచ్చని సమాచారం.
మహబూబాబాద్ ఎంపి మలోత్ కవితకే మళ్ళీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో డోర్నకల్ నియోజకవర్గంలో కవిత, ఆమె తండ్రి రెడ్యానాయక్ అహంకార పూరిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకుర్చాయని పార్టీ నాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఎన్నికల నాటికి విద్యాధికులను ఎవరినైనా కొత్త వారిని పరిచయం చేయవచ్చని వినికిడి.
బలమైన అభ్యర్థులను పోటీకి నిలిపితే సరిపోదని…కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తేనే గులాబీ గుబాలిస్తుందని పార్టీ శ్రేణులు నాయకత్వానికి స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో.. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండగా రెండు జాతీయ పార్టీలు కావటంతో ఇతర రాష్ట్రాల నేతల నుంచి సహకారం ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా రెండు జాతీయ పార్టీలతో ఏ విధంగా డీ కొంటుందో వేచి చూడాలి.
-దేశవేని భాస్కర్