గతంలో మాదిరి ఎమ్మెల్సీ సీటు తమకే కేటాయించి మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన ఎం ఐ.ఎం చేసిన అభ్యర్థనకు బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం పార్టీ అభ్యర్థి కి సంపూర్ణ మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఎం ఐ.ఎం పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు. మరోవైపు ఎం.ఐ.ఎం పార్టీ అభ్యర్థిగా మిర్జా రహమత్ బేగ్ ను పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం మే 1న, మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానున్నాయి.
ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్ – రంగారెడ్డి –హైదరాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి పేరు ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది.అందులో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ నజర్ పెట్టింది. ఇప్పటికే ఎంఐఎం పార్టీ ముఖ్యనేతలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ నేతలతో వరసగా భేటీ అవుతున్నారు. ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల పాతబస్తీ పర్యటన సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.