Tuesday, January 21, 2025
HomeTrending Newsతెలంగాణలో రైతు ఆత్మహత్యలు జీరో - పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జీరో – పల్లా రాజేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మీద కొందరు వ్యక్తులు, పత్రికలు,సంస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, ఆత్మహత్యలకు వాళ్లే పురి కొల్పుతున్నారని ఆరోపించారు. శాసనసభ ఆవరణలోని బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈ రోజు రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, ఎం. ఎస్. ప్రభాకర్, ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని, గుడ్డి వ్యతిరేకతతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వారి లెక్కలను కూడా వక్రీకరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో తెలంగాణలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని బదులిచ్చిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. 2014 నుంచి ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలు 400 శాతం తగ్గాయన్నారు. కొన్ని పత్రికలు తాడు బొంగురం లేని కథనాలు రాస్తున్నాయని, బండి సంజయ్ తెలంగాణలో 10 వేల ఆత్మహత్యలు జరిగాయని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయని, ఆధారాలతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెబుతున్నామని తేల్చి చెప్పారు.

కేంద్ర మంత్రి తోమర్ ఆత్మహత్యలు తగ్గాయంటే..బండి సంజయ్ పెరిగాయంటున్నారని, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయం నెంబర్ వన్ కు చేరుకుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయం నెంబర్ వన్ కు చేరిందని, రైతుబంధు కేవలం భూస్వాములకే దక్కుతొందని కొందరు అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతుబంధు సాయం 81 శాతం బీసీ, ఎస్సి, ఎస్టీ వర్గాలు రైతులకే అందుతోందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు, కంటి వెలుగు కార్యక్రమాలపై కూడా బీజేపీ నేతలు తొర్రి మాటలు మాట్లాడుతున్నారని, కంటి వెలుగును ప్రఖ్యాతి పొందిన వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు.

మాజీ ips అధికారి, రాష్ట్ర బీ ఎస్ పి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలు సరి కాదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ప్రభుత్వం తనకు అప్పజెప్పిన బాధ్యతలను అధికారిగా ప్రవీణ్ దుర్వినియోగం చేశారని, విద్యా వ్యవస్థను బాగు చేయాలని పదవి ఇస్తే రాజకీయం కోసం ప్రవీణ్ వాడుకున్నారని ఆరోపించారు. స్వేరో వ్యవస్థను సృష్టించి భవిష్యత్ రాజకీయాల కోసం ప్రవీణ్ డబ్బులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ నోట నీతులు, సిద్ధాంతం వస్తుండటం విడ్డూరమని, మునుగోడు ఉప ఎన్నికలో ప్రవీణ్ ఎవరికి వత్తాసు పలికారో అందరికీ తెలుసని విమర్శించారు. కాన్షీరాం సిద్ధాంతాలకు మాయావతి తిలోదకాలు ఇచ్చినట్టే ప్రవీణ్ కుమార్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్