పార్లమెంట్ ఉభయసభల్లో ఐదో రోజు కూడా అదాని-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు చర్చ కోరుతూ ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇస్తూ.. చర్చకు పట్టు బడుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అదానీ – హిండెన్ బర్గ్ అంశం పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. మోదీ – అదానీల కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని నినాదాలు చేస్తూ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహం ఎదుట చేరుకుని అక్కడ ఆందోళన నిర్వహించారు. జేపీసీ ద్వారా విచారణ జరపాలని, మోదీ, అదానీలకు వ్యతిరేకంగా ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, ఇతర విపక్ష పార్టీల ఎంపీలతో కలిసి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేతలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు లు మీడియాతో మాట్లాడారు.
అదాని-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై విపక్ష పార్టీలన్నీ చర్చ కోరుతూ ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇస్తుంటే ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలమంతా ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కీలకమైన ఈ అంశంపై చర్చకు అనుమతించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు.
TRENDING NEWS
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com