బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నాటి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాడని అందరు ప్రశ్నించారు. SCలు జనరల్ సీటుల్లో పోటీ చేయకూడదా అని ఆయన ప్రశ్నించేవారు. ఆలంపూర్ లో ఆయన సోదరుడు ప్రసన్నకుమార్ ను బరిలోకి దింపి ప్రవీణ్ కుమార్ సిర్పూర్ ఎంచుకున్నారు. గెలుపు ఖాయమని భావించిన స్థానంలో ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు.
సిర్పూర్ అభ్యర్థుల్లో కోనేరు కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి గెలిచి… బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. ఈ దఫా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రావి శ్రీనివాస్ 2018 ఎన్నికల్లో ఏనుగు గుర్తు మీద పోటీలోకి దిగారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ దిగారు. అలా ఏనుగు ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితమే అయినా ఆదరించకపోవటంపై స్వేరోస్ విశ్లేషణ చేస్తున్నారు.
నామినేషన్ వేసిన తొలినాళ్ళలోనే ప్రవీణ్ కుమార్ గెలుపు ఖరారైందని టాక్ రావటం…దీంతో స్వేరోస్ తోపాటు ఆయన మద్దతుదారుల మాటలు శృతిమించాయని అంటున్నారు. చివరి రోజుల్లో యుపి సిఎం యోగి ప్రచారంతో ఉత్తర భారతీయులు బిజెపికి మొగ్గు చూపారని తెలిసింది.
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదివిన, చదువుతున్న విద్యార్థులు సిర్పూర్ లో ప్రచారానికి వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే గ్రామాల్లో ఏనుగు గుర్తు, ప్రవీణ్ కుమార్ గెలుపు ఆవశ్యకతపై వివరించారు. స్వేరోస్ బలంగా ఉన్నారని భావించారు. అయితే పోలింగ్ సమయానికి కొందరు తాయిలాలకు లొంగిపోయారని ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది కానీ సిర్పూర్ కు రాలేదని… ఈ ప్రాంతం ఆంధ్ర పెత్తందారుల కబందహస్తాల్లోనే ఉందని ప్రవీణ్ కుమార్ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ ప్రాంతాన్ని విముక్తి చేయటమే తన లక్ష్యమని ప్రచారంలో వివరించారు. మీరు కూడా నాన్ లోకల్ అనే సరికి ఇళ్ళు కొనుక్కుని గృహ ప్రవేశం చేశారు. స్థానికత నినాదంతో చేసిన ప్రచారం చివరకు పాల్వాయి హరీష్ కు ఉపయోగపడింది.
ఆలంపూర్ లో పోటీ చేస్తే సునాయాసంగా గెలిచేవారని…పట్టణ ఓటర్లు ఉండే వర్ధన్నపేట నుంచి పోటీ చేయాలని సన్నిహితులు కోరినా ప్రవీణ్ కుమార్ పెడచెవిన పెట్టారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాబోయే లోకసభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపిగా పోటీ చేయాలని అనుచరులు కోరుతున్నారు. అదే సమయంలో కాగజ్ నగర్ లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు కనుక పెద్దపల్లి నుంచి బరిలోకి దిగాలని శ్రేయోభిలాషులు హితవు పలుకుతున్నారు. బీఎస్పీ అధినేత తన అంతరంగం వెల్లడించటం లేదు.
తెలంగాణలో మొదటి నియోజకవర్గం సిర్పూర్ నుంచి గెలుపు మొదలుపెట్టి రాష్ట్రంలో ఏనుగు అంబారి ఎక్కాలని భావించిన ఆర్.ఎస్.పీ వ్యూహానికి ఆదిలోనే అవాంతరం ఎదురైంది. పెద్దపల్లిలో దాసరి ఉష ప్రచారం ఉదృతంగా నిర్వహించినా ఫలితం దక్కలేదు. కేవలం ముదిరాజ్ ఓట్లపై ఆధారపడి టికెట్ ఇచ్చిన పటాన్ చెరువులో ఓట్లు దక్కినా…ఇతర ప్రాంతాల్లో ఏనుగును ఆదరించలేదు. కేవలం స్వేరోస్ మీద ఆధారపడటం మానేసి…అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతేనే అందరి పార్టీగా బీఎస్పీని ప్రజలు ఆదరిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-దేశవేని భాస్కర్