Buchhaiah Chowdary Welcomed The Govt Decision On 3 Capitals :
మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. విశాఖకు తాగునీటి సమస్య ఉందని, వెంటనే గోదావరి జలాలను తరలించాలని బుచ్చయ్య డిమాండ్ చేశారు. అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో సెంటర్ పాయింట్ గా ఉందని, సకల సదుపాయాలూ ఇక్కడ ఉన్నాయని చెప్పారు.
సిఆర్డీయే చట్టాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కితీసుకొని సిఆర్డీయేను కొనసాగించాలని బుచ్చయ్య విజ్ఞప్తి చేశారు. అమరావతి కోసం వేలాదిమంది రైతులు త్యాగాలు చేశారని, వారికి చట్టపరమైన హామీ ఇచ్చారని, వారికి న్యాయం జరగకుండా ఈ అంశంపై ముందుకు వెళ్లలేరని…. అందుకే మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అయన విశ్లేషించారు. హైకోర్టుతో పాటు, సుప్రీం కోర్టుకు వెళ్ళినా రైతులకే విజయం వస్తుందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ సొంత నిర్ణయాలు చేస్తామంటే కుదరదని అన్నారు. ప్రభుత్వం ఈ విషయమై స్పష్టత ఇచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు.