Thursday, May 30, 2024
HomeTrending Newsఅలిగిన గోరంట్ల, బుజ్జగించిన బాబు

అలిగిన గోరంట్ల, బుజ్జగించిన బాబు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుజ్జగించారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసే యోచనలో బుచ్చయ్య చౌదరి ఉన్నట్లు నేటి ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ‘ఇప్పుడు నేనేమీ మాట్లాడను, తర్వాత మాట్లాడతా’ అని వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఫోన్ లో బుచ్చయ్యతో మాట్లాడి సముదాయించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కే. అచ్చెన్నాయుడు కూడా ఫోన్ లో మాట్లాడారు.

ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీలలో ముఖ్యంగా మహిళా కమిటీలో తాను సూచించిన ముగ్గురికి పదవులు ఇవ్వలేదని బుచ్చయ్య అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై చంద్రబాబు, లోకేష్ లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారు అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఇది బుచ్చయ్యకు మరింత ఆగ్రహాన్ని తెప్పించిందని అయన అనుచరులు వెల్లడించారు. అందుకే తీవ్ర అసంతృప్తికి లోనైన గోరంట్ల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్పాలని ఒక దశలో అనుకున్నారు. ఇదే విషయాన్ని తన అనుచరుల ద్వారా మీడియాకు సమాచారం కూడా పంపారు.

మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ గాలి బలంగా వీచినప్పటికీ రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం సాధించింది. సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ, రూరల్ నుంచి గోరంట్ల ఎన్నికయ్యారు.

గతంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కూడా పలు సార్లు పార్టీ, అధినేత చంద్రబాబు తీరుపై గోరంట్ల బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసేవారు. సీనియర్ గా ఉన్న తనను కాదని పార్టీలో కొత్తగా వచ్చిన వారికి, జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని అయన విమర్శించేవారు. పార్టీ అపదకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి, షో చేసే వారికి పదవులు ఇస్తున్నారని అయన తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారు. గోరంట్ల మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్