Sunday, January 19, 2025
HomeTrending Newsబాబుది వీధి రౌడీల భాష: బుగ్గన ఆగ్రహం

బాబుది వీధి రౌడీల భాష: బుగ్గన ఆగ్రహం

నన్ను గెలిపిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు చెబితే అది ఎవరికి నష్టమని…. ‘మీరు తులసి తీర్థం పోస్తే నేను బతుకుతా’ అన్నట్లు ఆయన వ్యవహారం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  ఎద్దేవా చేశారు.  కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన స్పందించారు. విజయవాడలో మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. ఆరువేల స్కూళ్ళు మూతపడ్డాయని, నాలుగు లక్షల మంది విద్యార్ధులు బడి మానేశారని చంద్రబాబు చెప్పడంపై బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేశారు. 70 ఏళ్ళ వయసులో, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, 14 ఏళ్ళు సిఎంగా పనిచేసిన వ్యక్తి చెప్పాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు. బాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాతే ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ మొదలు పెట్టమన్నారు బుగ్గన. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం తప్ప మరేమీ చేయలేదని, సీమ ఏం పాపం చేసిందని…. కర్నూలుకు న్యాయ రాజధాని వస్తుంటే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. సీమ, కర్నూలు ప్రజలు ఇంకా సంస్కారవంతులు కాబట్టే ఆయన పర్యటిస్తుంటే ఏమీ అనడంలేదన్నారు.

తనను అప్పుల మంత్రి అని చంద్రబాబు అనడాన్ని బుగ్గన తప్పుబట్టారు. ఏ రాష్ట్రంలో అయినా ఆర్ధిక మంత్రే అప్పులు తెస్తారని, హోం మంత్రి, రెవిన్యూ మంత్రి చేయరని వ్యాఖ్యానించారు. ఏపీ తప్ప మరే రాష్ట్రమూ అప్పులు చేయడంలేదా… తాము తెచ్చింది 17శాతం అని, బాబు హయాంలో 20 శాతం అప్పులు తెచ్చారని అప్పుడు యనమల పెద్ద అప్పుల మంత్రి అవుతారా అని నిలదీశారు. తన ఇంటిని, జీవితాన్ని కూలుస్తానంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. వీధిరౌడీలు, రౌడీషీటర్లు వాడే భాష అని…. ఒక పెద్ద మనిషి మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదన్నారు. 1923లో మా ముత్తాత కట్టిన ఇంట్లోనే తాము ఇప్పటికీ నివశిస్తున్నామని, మీలాగా పెద్ద పెద్ద బంగ్లాలు, మిద్దెలు కట్టుకోలేదని, మీరు కూల్చాలనుకుంటున్న ఇంటికి వందేళ్ళ చరిత్ర ఉందని, కానీ 1923లో మీరు నారావారి పల్లెలో ఎక్కడ ఉన్నారని, అసలు మీరు సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారా అని బాబును సూటిగా ప్రశ్నించారు.

Also Read : బాబుకు మరో ఛాన్స్ లేదు: సజ్జల  

RELATED ARTICLES

Most Popular

న్యూస్