Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎద్దుల సాక్షిగా మూడు ముళ్లు

ఎద్దుల సాక్షిగా మూడు ముళ్లు

Basava the Guest: శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం అక్కడ ఏవైనా దుష్టశక్తులు, దృష్టి దోషాలు ఉంటే మటుమాయమవుతాయని ఈ ఆచారం చెబుతుంది. ఆవు పంచకం, నవధాన్యాలు ఇల్లంతా చల్లితే ఈ ఆచారం ప్రకారం ఆ ఇల్లు మనం ఉండడానికి యోగ్యమవుతోంది.

పురాణాల ప్రకారం దేవుళ్ల వాహనాలకు కూడా దైవత్వం ఉంటుంది.

శివుడు- బసవడు
విష్ణువు- గరుత్మంతుడు
గణపతి- ఎలుక
సుబ్రహ్మణ్యుడు- నెమలి
అమ్మవారు- పులి/సింహం

ఇలా ఒక్కో దేవుడు/దేవతకు ఒక్కో వాహనం మనకు తెలిసిందే. ఇప్పుడంటే మనకు బెంజులు, బెంట్లీలు, రోల్స్ రాయిస్ లు వచ్చాయి కానీ- అనాది కాలంలో పరమేశ్వరుడయినా కాస్త అక్కడిదాకా డ్రాప్ ఇవ్వు అని ఎద్దునో, గద్దనో అడగాల్సిందే. ఆ రోజుల్లో పశువులు కూడా మాట్లాడేవి. దాంతో పరమేశ్వరుడు బిజీగా ఉంటే ఆయన వాహనం నందితో మాట్లాడినా పని అయిపోయేది. పదితలల రావణాసురుడిని నంది అడ్డుకుంటేనే కదా నానా గొడవ జరిగింది!

వ్యాసాలన్నిటికి ఆవు వ్యాసమే మూలం. లేదా సకల వ్యాసాలు చివరికి ఆవునే చేరుకోవాలి. ఆవుపాలు, ఆవు నెయ్యి శ్రేష్ఠం. లేపాక్షి నంది ప్రపంచ ప్రసిద్ధం.

“లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ;
కైలాస శిఖరిలా కదలిరావయ్య ;
హుంకరించిన దెసలు ఊగిపోయేను;
ఖురముతో దువ్వితే కులగిరులె వణికేను ;
ఆకాశగంగకై
అర్రెత్తిచూస్తేను ;
పొంగేటి పాల్కడలి గంగడోలాడేను ;
నందిపర్వతజాత
నవపినాకినీ జలము ;
నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె ;
ఒంగోలు భూమిలో పెనుకొండ సీమలో ;
నీ వంశమీనాడు నిలిచింది గర్వాన”
-అడవి బాపిరాజు

హరప్పా మొహంజదారో అతిపురాతన మానవనాగరికత చిహ్నాల్లో దొరికినవాటిలో పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దు ప్రధానమయినది. గొడ్డును కొట్టినట్లు మనం కొడుతున్నా ఎద్దు భరిస్తూనే ఉంది. గొడ్డు చాకిరి చేస్తూనే ఉంది. పొలాలన్నీ హలాలతో దున్నుతూనే ఉంది. ఫలసాయాన్ని వీపున మోసి ఇంటికి తెస్తూనే ఉంది. మెడమీద కాడిని కట్టుకుని యుగాలుగా మన నాగరికతను లాగుతూనే ఉంది.

“గొడ్డొచ్చిన వేళ…బిడ్డొచ్చిన వేళ…” అన్నారు. పాడి పంటలతో, ధన ధాన్యాలతో పల్లెలు ఒకప్పుడు కళకళలాడేవి. ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డ సాధారణ రైతులకు ఎడ్లు, ఎడ్ల బండి తప్పనిసరి. యుగయుగాలుగా భూగోళాన్ని దున్ని మనకు ఆహారాన్ని పండించిన, పండిస్తున్న ఎడ్ల చరిత్ర రాస్తే అంతులేని బసవపురాణమవుతుంది. ఎడ్లతో రైతు బంధం మాటలకందేది కాదు.

కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో రైతు మహేష్ కు పెళ్లి కుదిరింది. పెళ్లి ఫంక్షన్ హాల్ ఆవరణలో ప్రత్యేకంగా పందిరి వేయించాడు మహేష్. తనకు వ్యవసాయంలో సర్వస్వమయిన ఎడ్లను అందంగా అలంకరించి ఆ పందిట్లో నిలుచోబెట్టాడు. తాళి కట్టిన వెంటనే…నవ దంపతులు ఎడ్ల మధ్య నిలుచుని తనివితీరా ఫోటోలు తీసుకున్నారు. వారితోపాటు పెళ్లికొచ్చిన అతిథులు కూడా ఎడ్ల నోటికి పచ్చి గడ్డి పెడుతూ మురిపెంగా ఫోటోలు దిగారు.

ఇది చాలా చిన్న వార్తే కావచ్చు. కానీ…మనసు పొంగే ఆర్ద్రమయిన చాలా పెద్ద విషయం.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్