ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 ఎకరాల విస్తీర్ణంలో 13 ఎకరాలను మాల్ నిర్మాణానికే కేటాయించారని, ఇంత పెద్ద మాల్ దక్షిణ భారత దేశంలో మొదటిది అవుతుందన్నారు. హైదరాబాద్ లో రహేజా గ్రూప్ నిర్మించిన మాల్ కూడా ఏడెనిమిది ఎకరాల్లోనే ఉందన్నారు.విశాఖలో ఇనార్బిల్ మాల్ నిర్మాణానికి నీల్ రహేజాతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో జగన్ మాట్లాడారు.
ఈ మాల్ ద్వారా 600 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని సిఎం వెల్లడించారు. మిగిలిన నాలుగు ఎకరాల్లో రెండున్నర లక్షల స్క్వేర్ ఫీట్ లో ఐటి స్పేస్ నిర్మించబోతున్నారని, దీని ద్వారా కనీసం మూడు వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో పాటు కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని వివరించారు.
విశాఖ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టేందుకు వీలుగా ఇక్కడ అభివృద్ధి జరుగుతోందన్నారు. గతంలో అదానీ ఐటి స్పేస్ లో డేటా సెంట్రల్, భోగాపురం ఎయిర్ పోర్ట్ లకు, మూలపేటలో పోర్టుకు శంఖుస్థాపన చేశామని గుర్తు చేశారు. హిందూపురంలో రహేజా సంస్థ ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్క్ కు సంపూర్ణ సహకారాలు అందిస్తామని సిఎం జగన్ భరోసా ఇచ్చారు.