సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని తెలంగాణ కేబినేట్ అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో 111 జీవో రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆ జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేయకూడదని గతంలో 111 జీవో అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్ పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో ఉద్దేశ్యం సంబద్ధతను కోల్పోయింది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్ 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి.
ఈ జలాశయాల ద్వారా తాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రిగారు అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదలడానికి తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంద. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీగారి అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమనిబంధనలను ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీవోను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు.
Also Read : జీవో 111 పై మల్లగుల్లాలు