భారత్ నుంచి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్థులు వీసాల కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీనిపై ఒట్టావాలోని భారత హై కమిషన్ కెనడా అధికార యంత్రాంగాన్ని సంప్రదించి వివరణ కోరింది. కెనడా విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసానికి అనుమతి పొంది విసా రాకపోవటంతో వేల మంది భారత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాసంవత్సరం ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ట్యూషన్ ఫీజులు కాలేజీలకు చెల్లించిన విద్యార్థులు వీసాలో పడిగాపులు కాస్తున్నారు. విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరగటంతో వాంకోవర్, టొరంటో నగరాలలోని ఇండియన్ హై కమిషన్ అధికారులు కెనడా ప్రభుత్వానికి భారత విద్యార్థులు ఆవేదన వివరించారు. సుమారు 2,30,000 మంది భారత విద్యార్థులు కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళగా.. వారంతా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్య అబ్యాసిస్తున్నారు. వీరి నుంచి సుమారు నాలుగు బిలియన్ డాలర్లు కెనడాకు ఆదాయం సమకూరింది.
స్టడీ పర్మిట్ వీసాల జాప్యంపై ఢిల్లీలోని కెనడా హై కమిషన్ వరుస ట్వీట్లతో స్పందించింది. ‘‘కెనడాలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల అడ్మిషన్లు పొంది స్టడీ పర్మిట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరాశా, నిస్పృహలను మేం అర్థం చేసుకోగలం. ఈ ఏడాది అనూహ్యంగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. సంవత్సరం పొడవునా మేం దరఖాస్తులను ప్రాసెస్ చేస్తూనే ఉన్నాం. వాటితోపాటే 2022 సెప్టెంబరులో తరగతులకు హాజరుకావాల్సిన విద్యార్థుల దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. ప్రతి వారం వేలాది మంది భారతీయ విద్యార్థులకు వీసాలను అందిస్తున్నాం. ఇప్పటికీ వీసాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వెంటనే కెనడాలోని తమ విద్యాలయాలను సంప్రదించాలి’’ అని హై కమిషన్ విజ్ఞప్తి చేసింది.