Indian Winners Commendable :
ఒలింపిక్స్ వార్తలను కవర్ చేయడానికి ప్రఖ్యాత స్పోర్ట్స్ కాలమిస్ట్ బోరియా మజుందార్ టోక్యో వెళ్లాడు. అక్కడి నుండి ఎకనమిక్ టైమ్స్ పత్రికకు ఆయన ఒక సంపాదకీయ వ్యాసం రాశాడు.
“మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఇంకా ఎన్ని రావాల్సి ఉంది? అని లెక్కలు వేసి బాధ పడ్డం కంటే ఒలింపిక్స్ క్రీడలదాకా భారత్ పరుగు, బరిలో నిలబడడం, పోటీనివ్వడం, ప్రపంచం దృష్టిని ఆకర్షించడం…చిన్న విషయాలు కాదు. రావాల్సిన మెడల్స్ కన్నా…మెడల్స్ వేటలో మనం ప్రయాణించిన దూరం తక్కువ కాదు. మెడల్స్ కోసం మనం పడ్డ శ్రమ తక్కువ కాదు. ఊరు పేరు లేని గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడలను స్వప్నిస్తూ, ధ్యానిస్తూ, తపిస్తూ క్రీడా దీప్తిని చేతబట్టుకుని ఒలింపిక్స్ దాకా కొత్తతరం రాగలుగుతోంది. ఎన్నో కొన్ని మెడల్స్ ను గెలుస్తోంది…”
ఇలా కవితాత్మకంగా, చాలా పాజిటివ్ గా, ఉదాత్తంగా రాశాడు మజుందార్. క్రీడల మీద లోతయిన అవగాహన ఉన్నవాడు. క్రీడలను ఆవాహన చేసుకున్నవాడు.
నిజమే. రాని మెడల్స్ గురించి ఏడవడం కంటే…వచ్చినవాటి గురించి మాట్లాడ్డం, పోటీలో ధీటుగా నిలబడిన వారి గురించి మాట్లాడ్డం, తృటిలో మెడల్ చేజారేంత దగ్గరిగా వెళ్లడం గురించి మాట్లాడ్డం, నాలుగో స్థానంతో ఏ మెడల్ రాక కన్నీళ్లతో నిలుచున్న వారి గురించి మాట్లాడ్డం అవసరం.
అలాంటి మనసు పులకించే కొన్ని టోక్యో ఒలింపిక్స్ కార్టూన్లు, వార్తలను చూద్దాం.
నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో స్వర్ణం గెలిస్తే ‘జావెల్ ఇన్ ది క్రౌన్’ అని కార్టూన్ హెడ్డింగ్ పెట్టారు.
పి వి వింధు
పి వి సింధు మెడల్ కు అమూల్ కార్టూన్ ఇది. ఇంగ్లీషు విన్- గెలుపును సింధుకు కలిపి పి వి వింధు అన్న విరుపులో వేన వేల మాటలున్నాయి. అభినందనాలున్నాయి. ఆనందముంది.
గోలింపిక్స్
పురుషుల హాకీకి అమూల్ అభినందన ఇది. హాకీలో గోల్ మాటను- ఒలింపిక్స్ కు కలిపి గోలింపిక్స్ అని పెట్టారు.
బదహియా
రెజ్లర్ దహియా మెడల్ కు అమూల్ హిందీ బధాయ్- అభినందన మాటను కలిపి బదహియా హై శీర్షిక.
వీటికి ఇక వివరణ అక్కర్లేదు. మెరుపు లాంటి విరుపులు. ప్రోత్సాహం. ఆనందం. అభినందనలు. అందంగా ఉన్నాయి.
హోప్ ఫర్ న్యూ గోల్డెన్ ఏజ్
మహిళల హాకీలో మెడల్ రాకపోయినా కొంగొత్త ఆశలకు జీవం పోశారు. రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు అంటూ టైమ్స్ స్ఫూర్తిదాయకమయిన హెడ్డింగ్ పెట్టింది.
“కాంస్యం పోయినా…మనసులు గెలిచారు” అని మరో హెడ్డింగ్.
Cartoon And News Headings On Tokyo Olympics Indian Winners Commendable :
తెలుగులో కూడా మంచి శీర్షికలు వచ్చాయి. ప్రస్తుతం మన చర్చ అమూల్ కార్టూన్లు, ఇంగ్లీషు హెడ్డింగుల మీదే కాబట్టి…తెలుగు శీర్షికలను మరోసారి చర్చించుకుందాం.
(ఫోటోలు: ఎకనమిక్ టైమ్స్ సౌజన్యంతో)
Also Read : పరువు గెలిచిన పరుగు