Saturday, January 18, 2025
HomeTrending Newsపంజాబ్ లో మంత్రికి ఉద్వాసన

పంజాబ్ లో మంత్రికి ఉద్వాసన

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత క్యాబినెట్‌ సభ్యుడిని బర్తరఫ్ చేశారు. పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను బలపరిచే స్పష్టమైన ఆధారం లభించిందని సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. టెండర్లపై ఒక శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి విజయ్ సింగ్లా డిమాండ్ చేసినట్టు అవినీతి ఆరోపణలు వచ్చాయి. విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రాగానే సీఎం భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భగవంత్ మాన్ నిర్ణయాన్ని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ సమర్థించారు. అవినీతి ఆరోపణలపై సత్వరమే నిర్ణయం తీసుకున్న భగవంత్ మాన్ నిజమైన ప్రజా సేవకుదని కొనియాడారు.

మంత్రి బర్తరఫ్ అనంతరం సీఎం భగవంత్ మాన్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓటు వేశారని, ప్రజల ఆశలు, నమ్మకాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని తెలిపారు. భారత మాతకు అరవింద్ కేజ్రీవాల్ వంటి పుత్రుడు భగవంత్ మాన్ వంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతి పై మహా యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక మాడల్‌కు లోబడే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆప్ పేర్కొంది. విజయ్ సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ తమ నాయకుడైనా సరే అవినీతికి పాల్పడ్డాడని తెలిస్తే.. చర్యలు తీసుకునే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీనే అని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఇలాంటి సంచలన నిర్ణయాలు ఢిల్లీలో చూశామని, ఇప్పుడు పంజాబ్‌లో కూడా చూస్తున్నామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికే ప్రయత్నంలో భాగంగా జైళ్లలోని వీఐపీ గదులన్నింటినీ మూసివేసి మేనేజ్‌మెంట్ బ్లాక్‌లుగా మార్చాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ‌దుల‌ను సిబ్బందికి అప్ప‌గించాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు.  ‘‘ వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో, జైలు సిబ్బంది సజావుగా పనిచేసేందుకు వీలుగా జైళ్లలోని అన్ని వీఐపీ గదులను జైలు నిర్వహణ బ్లాక్‌లుగా మారుస్తాము. జైలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని భగవంత్ మాన్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్