అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష నిరోధక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. సెనేట్‌లో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్‌లో 35 మంది పాల్గొన్నారు. అందులో బిల్లుకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా.. ఒకరు మాత్రమే వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. దీంతో బిల్లు పాస్ అయినట్లు సభాపతి ప్రకటించారు. త్వరలో బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పంపిస్తామని, అక్కడ పాస్ అయ్యాక గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని తెలిపారు. గవర్నర్ సంతకం చేశాక ఎస్‌బీ 403 బిల్లు చట్టంగా మారుతుందని వివరించారు.
సెనేట్ ఆమోదంతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలకు నిలయమైన కాలిఫోర్నియా కులం ఆధారంగా వివక్షను నిషేధించిన మొదటి అమెరికా రాష్ట్రంగా అవతరించింది. కాగా, ఇటీవల సీటెల్ కుల ఆధారిత వివక్షను నిషేధించిన మొదటి నగరంగా నలిచిన సంగతి తెలిపిందే.