నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదని, నేరం జరిగిన విధానం పట్ల ఆయనకు అవగాహన లేదని సిబిఐ స్పష్టం చేసింది. ఏడాదిపాటు విచారణ జరిపి, 8 మంది సాక్షులను విచారించి 403 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలను కొట్టి పారేస్తూ దోషులతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది.
ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్ధిస్తూ సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ లను దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలకు అలవాటుపడ్డ నిందితులు కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణకు సిద్ధమని హైకోర్టులో కాకాణి స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు.
ఈ కేసులో తనకు క్లీన్ చీట్ రావడంపై మంత్రి గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు మాజీ మంత్రి సోమిరెడ్డి తనపై చేసిన ఆరోపణలు అర్తరహితమన్న విషయం తేలిందని… రాష్ట్ర పోలీసులు విచారణ జరిపి ఎవరిని దోషులుగా తెల్చారో వారే సిబిఐ విచారణలో కూడా నిందితులుగా వెల్లడించారని, ఈ ఘటన అడ్డం పెట్టుకొని తనపై పనికిమాలిన ఆరోపణలు చంద్రబాబు, సిపిఐ రామకృష్ణ లాంటి నేతలు కూడా మాట్లాడారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.