వివేకా హత్య కేసులో సిబిఐ తనను ఎలాంటి విచారణా చేయలేదని, కేవలం సమాచారం మాత్రమే అడిగిందని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం స్పష్టం చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు తాను చెప్పలేదని, ఏ సమయంలో జగన్ తమకు చెప్పారో కూడా గుర్తు లేదని…ఇదే విషయాన్ని సిబిఐకి చెప్పానన్నారు. సిబిఐ ఎస్పీ స్థాయి అధికారి తన వద్దకు వచ్చి కేవలం చిట్ చాట్ గానే మాట్లాడి సమాచారం తెలుసుకున్నారని, తాను చెప్పిన అంశాలని కేవలం సమాచారంగానే ఉంచుతారు గానీ, సాక్ష్యంగా కూడా పరిగణించబోరని చెప్పారు. అసలు గుండెపోటా, మరో కారణమా అనే ప్రశ్నే సిబిఐ తనను అడగలేదన్నారు. ఆరోజు జగన్ తో సమావేశంలో మొత్తం నలుగురం ఉన్నామని చెప్పారు.
తమ సమావేశం గురించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే సిబిఐ అధికారి తన నివాసానికి వచ్చారని, సమయం గురించే అడిగారని, మీటింగ్ ఏ సమయానికి మొదలయ్యిందో చెప్పానని, వివేకా మరణానికి సంబంధించిన సమాచారం జగన్ తమకు చెప్పిన మాట వాస్తవమేనని, కానీ కచ్చితంగా ఏ సమయం అనేది తెలియదని, అదే విషయాన్ని వివరించానని అజేయ్ కల్లం వివరించారు.
కోర్టులో ఛార్జ్ షీట్ వేసేంతవరకూ సమాచారం లీక్ చేయడం సరికాదని, కానీ మీడియాలో ఈ సమాచారం ఎలా వస్తోందో సిబిఐ చెక్ చేసుకోవాలని సూచించారు. తాను చెప్పిన విషయాలని వక్రీకరించి ఇష్టానుసారం వార్తలు రాశారని ఆయన ఆక్షేపించారు.